జాహ్నవి కేసు : న్యాయం గెలిచింది.. కానీ ఆ తండ్రి ఓడిపోయారు

అమెరికా వీధుల్లో అన్యాయంగా రాలిపోయిన ఒక తెలుగు విద్యార్థిని గాథ ఇది. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక తండ్రి వ్యథ ఇది.;

Update: 2026-02-13 07:52 GMT

అమెరికా వీధుల్లో అన్యాయంగా రాలిపోయిన ఒక తెలుగు విద్యార్థిని గాథ ఇది. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక తండ్రి వ్యథ ఇది. చివరకు న్యాయం గెలిచినా.. ఆ విజయాన్ని చూసేందుకు ఆ తండ్రి ప్రాణాలు నిలవకపోవడం విధి ఆడిన వింత నాటకం. అమెరికా గడ్డపై తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన ఆ తండ్రి.. చివరకు విజయం ముంగిట కుప్పకూలిపోయారు. సుమారు రూ. 262 కోట్ల (31.25 మిలియన్ డాలర్లు) భారీ పరిహారం ఇచ్చేందుకు అమెరికా అధికారులు అంగీకరించిన వేళ ఆ వార్త వినకుండానే జాహ్నవి తండ్రి కన్నుమూయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ రాత్రి ఏం జరిగింది?

2023 జనవరిలో సీటెల్ నగరంలో రోడ్డు దాటుతున్న జాహ్నవిని అతివేగంతో వచ్చిన ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే ఈ ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన బాడీ క్యామ్ దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. జాహ్నవి మరణాన్ని తక్కువ చేస్తూ "ఆమె ప్రాణానికి పెద్ద విలువ లేదు.. 11 వేల డాలర్ల చెక్కు రాసిస్తే సరిపోతుంది" అంటూ కొందరు అధికారులు నవ్వుకుంటూ మాట్లాడిన మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహానికి దారితీశాయి.

తండ్రి పోరాటం.. ఒక నిశ్శబ్ద యుద్ధం

కుమార్తె మరణం ఒక ఎత్తయితే ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు ఆ తండ్రిని మరింత కుంగదీశాయి. తన బిడ్డకు న్యాయం జరగాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన తన ఉద్యోగానికి సుదీర్ఘ సెలవు పెట్టారు. అమెరికా న్యాయ వ్యవస్థతో అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కేసును పక్కదారి పట్టకుండా చూశారు. ఇది కేవలం డబ్బు కోసం చేసిన పోరాటం కాదు.. తన కుమార్తె గౌరవం కోసం ఒక తండ్రి పడిన ఆవేదన. చివరకు ఆ పోరాటంలో తనువు చాలించారు.

భారీ పరిహారం.. కానీ తీరని లోటు

చాలా కాలం తర్వాత జాహ్నవి కుటుంబానికి సుమారు రూ. 262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది. భారతీయ విద్యార్థుల విషయంలో ఇంత భారీ మొత్తం ప్రకటించడం ఇదే మొదటిసారి. "న్యాయం జరిగింది కానీ, అది చూసేందుకు బాధితుడు లేడు." దురదృష్టవశాత్తూ ఈ పరిహారం ప్రకటన వెలువడటానికి కేవలం రెండు రోజుల ముందే జాహ్నవి తండ్రి మరణించారు. తన పోరాటం ఫలించిందని తెలుసుకోకుండానే ఆయన కన్నుమూయడం ఈ విషాదంలో మరో కోణం.

మిగిలిన ప్రశ్నలు.. మారని వ్యవస్థలు

ఈ ఘటన విదేశాల్లో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భద్రతపై మళ్లీ చర్చను లేవనెత్తింది. డబ్బుతో ప్రాణాన్ని వెలకట్టగలమా? అధికారుల నిర్లక్ష్యానికి కేవలం జరిమానా పరిష్కారమా? విదేశీ గడ్డపై భారతీయులకు రక్షణ ఎక్కడ? అన్నది ఆలోచించుకోవాల్సిన సమయం ఇదీ..

జాహ్నవి కందుల కేసు ఒక చేదు జ్ఞాపకం. ఒకవైపు న్యాయం గెలిచిందన్న తృప్తి ఉన్నా ఆ విజయాన్ని పంచుకోవాల్సిన తండ్రి, అనుభవించాల్సిన కుమార్తె ఇద్దరూ లేకపోవడం అత్యంత బాధాకరం. ఈ పరిహారం ఆ కుటుంబం కోల్పోయిన మనుషులను తిరిగి తీసుకురాలేదు.. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం.

Tags:    

Similar News