సుప్రీంకోర్టు ఆదేశం: డిజిట‌ల్ అరెస్ట్‌!

దేశంలో సైబ‌ర్ మోసాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏది నిజ‌మో.. ఏది మోస‌మో గుర్తించే ప‌రిస్థితి కూడా క‌రువవుతోంది.;

Update: 2025-10-17 10:42 GMT

దేశంలో సైబ‌ర్ మోసాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏది నిజ‌మో.. ఏది మోస‌మో గుర్తించే ప‌రిస్థితి కూడా క‌రువవుతోంది. తాజాగా వెలుగు చూసిన ఘ‌ట‌న దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని కూడా దిగ్భ్రాంతికి గుర‌య్యేలా చేసింది. ``సుప్రీంకోర్టు ఆదేశాలు వ‌చ్చాయి. మిమ్మ‌ల్ని డిజిట‌ల్ అరెస్టు చేస్తున్నాం. దీని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కోటి రూపాయ‌లు ఇవ్వాలి.`` అని సైబ‌ర్ మోస‌గాళ్లు బెదిరించ‌డంతో ఈ విష‌యం నిజ‌మేన‌ని న‌మ్మిన 73 ఏళ్ల వృద్ధురాలు స‌ద‌రు మొత్తాన్ని ఇచ్చేసింది. అయితే.. త‌ర్వాత ఇది మోస‌మేన‌ని గుర్తించి సుప్రీంకోర్టుకు లేఖ రాసింది.

ఈ లేఖ‌ను సుమోటోగా విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. డిజిట‌ల్‌, సైబ‌ర్ మోసాల్లో ఇది ప‌రాకాష్ట అని పేర్కొన్న సుప్రీం ధ‌ర్మాస‌నం.. అస‌లు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన‌ట్టుగా స‌ద‌రు వృద్ధురాలికి న‌కిలీ ప‌త్రాలు చూ పించ‌డం వెనుక ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై సీరియ‌స్ అయింది. దీనిని తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామని... పేర్కొంది. దేశంలో సుప్రీంకోర్టుపై ప్ర‌జ‌లకు గౌర‌వం మ‌ర్యాద‌, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని.. ఇప్పుడు వాటిని ఫ‌ణంగా పెట్ట‌లేమ‌ని పేర్కొంది.

ఈ క్ర‌మంలో స‌ద‌రు కేసును స్వ‌యంగా విచార‌ణ‌కు స్వీక‌రిస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశంలో సైబ‌ర్ మోసాలు పెరిగిపోతుండ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ధ‌ర్మాస‌నం.. ఈ విష‌యంలో కేంద్రం తీసుకున్న చ‌ర్య‌లు.. ఇప్పటి వ‌ర‌కు ఎంత మందిని అరెస్టు చేశారు? ఎన్ని కేసులు ప‌రిష్క‌రించారో.. వివ‌రాల‌తో త‌మ‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. తాజాగా వెలుగు చూసిన పంజాబ్ వృధ్ధురాలి కేసులో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చెప్పాల‌ని కూడా కేంద్రాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News