సుప్రీం సంచలన తీర్పు: కేసు వేసిందెవరు? ఎందుకు వేశారు?

శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోనూ.. .వాట్సాప్ గ్రూపుల్లోనూ.. వార్తా సంస్థల్లోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పెద్ద ఎత్తున మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతున్నాయి.

Update: 2026-05-30 04:46 GMT

శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోనూ.. .వాట్సాప్ గ్రూపుల్లోనూ.. వార్తా సంస్థల్లోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పెద్ద ఎత్తున మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతున్నాయి. అయితే.. బట్వాడా అవుతున్న సమాచారంలో వివరాలు సంపూర్ణంగా లేకపోవటం ఒక ఎత్తు అయితే..ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేని పరిస్థితి. అంతేనా.. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున బయటకు వచ్చిన దినపత్రికలను.. వాటి రిపోర్టులను చూసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో అత్యధిక మీడియా సంస్థలు ఇచ్చారు. అయితే.. ఈ సంచలన తీర్పునకు సంబంధించి.. అసలు ఈ కేసును వేసింది ఎవరు? ఏ సందర్భంలో ఈ కేసు వేశారు? ఆ సందర్భంలో కేసు వేసిన ఉద్దేశం ఏమిటి? సదరు సంస్థ ఎక్కడిది? దాన్ని నిర్వహించేది ఎవరు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి.

ఇలాంటి వేళ.. స్వతంత్రంగా.. పలు అంశాలను శోధించి.. వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించి మా పాఠకులకు వివరాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎవరిని కించపర్చటమో మా ఉద్దేశం కాదు. నిజాన్ని నిజంగా.. వాస్తవాలను ప్రజలు అర్థవంతంగా.. న్యాయబద్ధంగా తెలుసుకునే కనీస హక్కు ఉంది. ఈ సందర్భంగా సమాచారాన్ని అందించే క్రమంలో.. తప్పు అర్థం వచ్చేలా ఉంటే.. ఇబ్బంది అవుతుందన్న అనవసర జాగ్రత్తలకు వెళ్లటం ద్వారా అరకొర సమాచారం సమాజానికి చేరటం కూడా సరి కాదు. జరిగిన విషయాల్ని జరిగినట్లుగా చెప్పాల్సిన అవసరం ఉంది.

ఈ డిజిటల్ యుగంలో సమాచారాన్ని సేకరించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా వినియోగించుకొని.. వాస్తవాలకు దగ్గరగా ఉండే సమాచారాన్ని ఇవ్వాలన్న సదుద్దేశంతోనే ఈ కథనాన్ని రాయటం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎవరైనా తమ వివరణ ఇవ్వాలని భావిస్తే.. దాన్ని కూడా ప్రచురించటం ద్వారా.. మరింత పారదర్శక సమాచారం పాఠకులకు అందుతుందన్నది మా లక్ష్యం. ఇక.. అసలు విషయంలోకి వెళితే.. దేశంలోని వయోజనులు ఎవరైనా తమ పూర్తి సమ్మతితో వేశ్యావృత్తిని చేస్తుంటే.. అలాంటి వారు చేసేది చట్టవిరుద్ధం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. వేశ్యావృత్తిలో ఉన్న వారిని వేధించొద్దన్న విషయాన్ని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. అదే సమయంలో అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తిలో కూరుకుపోయిన వారిని ఒకేలా చూడొద్దని స్పష్టం చేసింది.

పూర్తి సమ్మతితో వేశ్యావృత్తిలో ఉన్న వారిని ట్రాఫికింగ్ బాధితులుగా చూడొద్దని చెబుతూనే.. ఒకవేళ నిజంగా ట్రాఫికింగ్ అయితే సమ్మతి అనేది చెల్లే అవకాశమే లేదని స్పష్టం చేసింది. దాదాపు 22 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసు సుప్రీంకోర్టులో ఒక ప్రజావ్యాజ్యం రూపంలో అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. సుదీర్ఘకాలం నడిచిన ఈ కేసుకు సంచలన తీర్పుతో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకూ ఈ తీర్పునకు కారణమైన పిటిషన్ ఏంటి? దాన్ని ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అన్న వివరాల్ని తెలుసుకున్నప్పుడు మాత్రం ఆశ్చర్యానికి గురి కాక మానదు.

ఆసక్తికర అంశం ఏమంటే.. తాజాగా వెలువడిన తీర్పునకు.. అదే సమయంలో సదరు పిల్ వేసిన సంస్థ పిటిషన్ లోని అంశాలు వేర్వేరు. అయితే.. ఈ రెండింటి మధ్య ఉన్న ఒక సన్నటి గీతను గుర్తించి.. ఎలాంటి సంశయాలకు అవకాశం ఇవ్వకుండా.. పూర్తి స్పష్టత ఇవ్వటంతో పాటు.. బాధితులకు రక్షణ ఎంత ముఖ్యమో.. వయోజనులకు తమ హక్కులను పొందటం కూడా అంతే ముఖ్యమన్నట్లుగా సుప్రీం తీరు ఉందని చెప్పాలి.

ఇంతకూ సుప్రీంలో పిల్ వేసిన సంస్థ విషయానికి వస్తే.. హైదరాబాద్ మహానగరంలో హ్యుమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాడే ప్రజ్వల అనే సంస్థగా చెప్పాలి. ఈ సంస్థను డాక్టర్ సునీతా కృష్ణన్. తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు తక్కువనే చెప్పాలి. ప్రజ్వల సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు మాత్రమే కాదు చీఫ్ లైఫ్ లైన్ గా చెప్పాలి. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆమె చేసిన అసమాన పోరాటానికి భారత ప్రభుత్వం ఆమెను 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రజ్వల సంస్థను 1996లో బ్రదర్ జోస్ వెట్టికట్టిల్ తో కలిసి ఆమె స్థాపించారు. ఆయన మరణం తర్వాత సునీతా కృష్ణన్ నడిపిస్తున్నారు.

ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారన్న విషయంలోకి వెళితే.. హైదరాబాద్ లోని ప్రసిద్ద రెడ్ లైట్ ఏరియా మెహబూబ్ కీ మెహందీ నుంచి మహిళలను ఖాళీ చేయించినప్పుడు.. దిక్కుతోచని స్థితిలో ఉన్న సెక్స్ వర్కర్లు, వారి పిల్లలకు ఆశ్రయం కల్పించటం కోసం ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ అక్రమ రవాణాను అడ్డుకోవటం.. పేద.. బలహీన బాలికలు.. మహిళలు వ్యభిచార రొంపిలోకి దిగకుండా అవగాహన కల్పించటం.. బాధితులను మాఫియా నుంచి.. వ్యభిచార ముఠాల నుంచి రక్షించటం.. అలా రక్షించిన వారిని తక్షణ వైద్య సాయంతో పాటు.. వారి పునరావాసానికి సాయం చేయటం.. వారికి సమాజంలో గౌరవస్థానాన్ని తిరిగి కల్పించేలా ప్రయత్నించటంతో పాటు.. వారిని వారి కుటుంబాలతో కలిపే పని చేయటంతో పాటు.. విదేశాల నుంచి అక్రమ రవాణా ద్వారా దేశానికి తీసుకొచ్చిన బాధితులను సురక్షితంగా వారి దేశాలకు పంపే పనులు చేస్తారు.

ప్రజ్వల సంస్థకు ప్రపంచంలోనే అతి పెద్ద యాంటీ ట్రాఫికింగ్ షెల్టర్ హోమ్స్ నిర్వహిస్తున్న సంస్థల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇంతకూ 22 ఏళ్ల క్రితం ప్రజ్వల సంస్థ ఏ నేపథ్యంలో ఈ పిల్ ను న్యాయస్థానంలో దాఖలు చేసిందన్న విషయంలోకి వెళితే.. ప్రజ్వల సంస్థ దాఖలు చేసిన పిల్ కు.. తాజాగా వచ్చిన తీర్పునకు మధ్య పోలిక లేనట్లుగా.. ఒకదానికి మరొకటి పరస్పర విరుద్ధంగా మారినట్లుగా కనిపించే అవకాశం ఎక్కువ. కానీ.. లోతుల్లోకి వెళ్లి చూస్తే..సుప్రీంకోర్టు అసలు ఉద్దేశం అర్థమవుతుంది. బాధితులు ఏ రూపంలో ఉన్నా.. వారికి చట్టబద్ధమైన రక్షణ ఎంత ముఖ్యమో.. వారి హక్కులను కాపాడటం అంతే ముఖ్యమైన విషయం అర్థమవుతుంది.

విషయాన్ని క్లుప్తంగా చెబితే ప్రజ్వల ఎలాంటి అంశాలతో కేసు వేసిందనే విషయానికి వస్తే.. మైనర్లను.. మహిళలను కిడ్నాప్ చేసి.. మోసం చేసి వ్యభిచార కూపంలోకి లాగుతున్న హ్యుమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కాబట్టి దేశ వ్యాప్తంగా అక్రమ రవాణాను అరికట్టే గట్టి చట్టం తేవాలి. రక్షించిన మహిళలకు సరైన రక్షణ గృహాలు.. ఉపాధి కల్పించాలని కోరుతూ కేసు వేయటం జరిగింది. ప్రజ్వల సంస్థ కోరినట్లే దేశ వ్యాప్తంగా ఒకే రకమైన బాధితుల రక్షణ ప్రణాళికను కోర్టు విడుదల చేసింది. రక్షణ గృహాల్లో కనీస వసతులు ఉండాలని, సైబర్ నెట్‌వర్క్ ద్వారా జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన ఆర్డర్ వేసింది.

తన పిటిషన్ లో భాగంగా ప్రజ్వల సంస్థ తన వాదనల్లో భాగంగా.. మహిళలు ఎవరూ ఇష్టపూర్వకంగా వేశ్యావృత్తిలోకి రారు. అందరూ బలవంతంగా.. పేదరికం వల్లే వస్తారు.కాబట్టి వ్యభిచారాన్ని దేశంలో పూర్తిగా నిర్మూలించాలని కోరింది. ఇక్కడ ఒక సందేహం రావొచ్చు. ప్రజ్వల సంస్థ కేవలం బలవంతపు వ్యభిచార బాధితులను కాపాడటం కోసం, మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసమే కేసు వేసింది కదా? మరి ఇష్టపూర్వకంగా (సమ్మతితో) సెక్స్ వర్క్‌లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టొద్దనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఇదే తీర్పులో ఎందుకు చేర్చింది?

అక్కడికే వస్తున్నాం. గతంలో 'బుద్ధదేవ్ కార్మాస్కర్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఆధారంగా చేసుకుని.. తాజాగా ప్రజ్వల కేసులో కోర్టు ఈ స్పష్టత ఇచ్చింది. అక్రమ రవాణాను అరికట్టే నెపంతో పోలీసులు క్షేత్రస్థాయిలో హోటళ్లపై దాడులు చేసి, అక్కడ ఇష్టపూర్వకంగా ఉన్న వయోజన మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తున్న అంశాన్ని కోర్టు గమనించింది. అందుకే బాధితులకు రక్షణ కల్పిస్తూనే, మరోవైపు పౌరుల హక్కులను కాపాడేలా కోర్టు ఈ రెండు అంశాలను సమతుల్యం చేస్తూ ఒకే తీర్పులో స్పష్టమైన గీత గీసిందని చెప్పాలి.

‘‘పోలీసులు రైడ్స్ చేసినప్పుడు ఎవరు బలవంతంగా వచ్చారో, ఎవరు సొంత ఇష్టంతో (సమ్మతితో) ఉన్నారో తెలియకుండా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అందుకే, రైడ్ చేసిన తక్షణమే పోలీసులు 'ప్రాథమిక విచారణ' జరపాలి. అక్కడ ఒక మహిళ సొంత సమ్మతితోనే ఉందని తేలితే, ఆమెను అక్రమ రవాణా బాధితురాలిగా చూడకూడదు, ఆమెపై కఠిన చర్యలు తీసుకోకూడదు." అన్న విషయాన్ని పేర్కొంది. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే.. ప్రజ్వల సంస్థ కేసు (పిల్ దాఖలు) వేసింది కేవలం బలవంతపు వ్యభిచార బాధితులను కాపాడటం కోసం మాత్రమే. అయితే.. సమ్మతితో ఉన్న వారిని ఇబ్బంది పెట్టొద్దన్న అంశాన్ని తీర్పులో చేర్చింది. ఎందుకిలా జరిగింది? పిల్ వేసింది ఒక అంశం మీద అయితే.. అందుకు సంబంధం లేని అంశం తీర్పులోకి వచ్చింది ఎందుకు? అన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. సమ్మతితో ఉంటే వదిలేయాలన్న నిర్ణయానికి సుప్రీంకోర్టు రావటానికి బలమైన కారణం లేకపోలేదు.

అక్రమ రవాణా మాఫియాను అణిచివేయటానికి పోలీసులు కఠినంగా దాడులు చేయాలని ప్రజ్వల సంస్థ కోరింది. అయితే.. విచారణలో భాగంగా కోర్టు గుర్తించిన.. గమనించిన వాస్తవ పరిస్థితులు.. అంశాల్ని పరిగణలోకి తీసుకొని ప్రజ్వల సంస్థ కోరినట్లు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తే.. క్షేత్రస్థాయిలో పోలీసులు హోటళ్లపై దాడులు చేసి.. అక్కడ ఇష్టపూర్వకంగా(సమ్మతితో) ఉన్న వయోజన మహిళలను కూడా బలవంతంగా రెస్క్యూ చేూస్తామంటూ వారి వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బ తీస్తున్న అంశాన్ని గుర్తించారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పార్దీవాలా.. జస్టిస్ మహదేవన్ ల బెంచ్ ఈ తీర్పులో ఒక చట్టపరమైన గీతను గీసినట్లుగా చెప్పాలి. తాము ప్రజ్వల సంస్థ కోరినట్లే.. బాధితుల రక్షణకు పూర్తి ప్లాన్ ఇస్తున్నామని.. అదే సమయంలో పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్కర్లుగా ఉన్న వారిని వేధించవద్దని పేర్కొన్నారు. బలవంతపు అక్రమ రవాణా వేరు.. సమ్మతితో కూడిన సెక్స్ వర్క్ వేరన్న విషయాన్ని స్పష్టం చేయటం ద్వారా.. కొన్ని సందర్భాల్లో కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని హక్కులను కాలరాచే అవకాశాన్ని తొలగించిందని చెప్పాలి. మరో అంశంపై స్పష్టత ఇచ్చిన తర్వాత దీన్ని ముగించటం సబబుగా ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకునే వీలుందా? అంటే.. తప్పుగా ప్రస్తావించటం.. విషయాన్ని పూర్తిగా కాకుండా అరకొరగా అవగాహన చేసుకొని చూసినప్పుడు తప్పుగా అనిపించొచ్చు. అలా అని సరైన అవగాహన లేని వారి కారణంగా.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయకపోవటం కూడా సరి కాదు కదా? అత్యున్నత న్యాయస్థానం ఉద్దేశం చాలా స్పష్టం. ఒక అమాయక మహిళను బలవంతంగా వ్యభిచారంలోకి దించితే నిర్దాక్షిణ్యంగా శిక్షించండని పేర్కొంటూనే.. ఆ పేరుతో పరస్పర సమ్మతితో ప్రైవేటు స్థలాల్లో ఉండే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి పోలీసులు చొరబడి.. బెదిరింపులకు పాల్పడే తీరుకు చెక్ చెప్పినట్లుగా మాత్రమే చెప్పాలి. మొత్తంగా చూస్తే.. పిటిషనర్ కోరినట్లుగా బాధితుల పక్షాన చట్టం నిలవటమే కాదు.. అలాంటి వారికి రక్షణతో పాటు.. అలాంటి తప్పులు చేసే వారికి కఠినంగా శిక్షించేలా ఉండటంత.. అదే సమయంలో దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేలా.. వారి హక్కులకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారికి చెక్ పెట్టినట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News