మొన్న బాత్ రూమ్ లో, నేడు బీరు తాగుతూ.. గుజరాత్ హైకోర్టులో ఏమిటిది?
ఈ నేపథ్యంలో అదే హైకోర్టులో లాయర్ వింత వ్యవహారం తెరపైకి వచ్చింది.;
న్యాయస్థానాల్లో ఎవరికైనా, ఎంతటివారికైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం. అక్కడున్న న్యాయస్థానానికి, న్యాయమూర్తికి గౌరవం ఇవ్వడం అంటే.. న్యాయ దేవతను గౌరవించడమే! అలాంటి న్యాయస్థానంలో వర్చువల్ గా విచారణకు హాజరయ్యే వారు చేస్తోన్న విచిత్ర చేష్టలు, జుగుప్సాకరమైన పనులు ఇటీవల వరుసగా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో బీర్ తాగుతూ వాదనలు వినిపించారు ఓ లాయర్!
అవును... ఇటీవల గుజరాత్ హైకోర్టులో వర్చువల్ విచారణకు హాజరైన వ్యక్తి.. ఏకంగా బాత్ రూమ్ నుంచి ఆన్ లైన్ లోకి వచ్చాడు. తనపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఫిర్యాదుదారుడే.. బాత్ రూమ్ లో పని కానిస్తూ విచారణకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో అదే హైకోర్టులో లాయర్ వింత వ్యవహారం తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... జూన్ 26న గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ సందీప్ భట్ ధర్మాసనం ఓ కేసులో విచారణ జరుపుతుంది. ఈ సమయంలో.. పిటిషనర్ తరఫున న్యాయవాది భాస్కర్ తన్నా వర్చువల్ గా హాజరయ్యారు. ఇది చాలా మంది లాయర్లు చేసే పనే. అయితే... ఈయన మాత్రం బీరు సేవిస్తూనే ధర్మాసనానికి వాదనలు వినిపించారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
దీంతో... ఆయన ప్రవర్తనను కోర్టు ధిక్కరణగా భావించి సుమోటోగా స్వీకరిస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్. సుపేహియా, జస్టిస్ ఆర్.టి.వచ్చానీల ధర్మాసనం తాజాగా ప్రకటించింది. రెండు వారాల తర్వాత ఈ కేసులో వాదనలు వింటామని తెలిపింది. ఇదే సమయంలో... భాస్కర్ కు ఉన్న సీనియర్ న్యాయవాది హోదాను పునఃపరిశీలిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతెకాదు.. ఇకపై వర్చువల్ గా వాదనలు వినిపించడానికి కుదరదని తేల్చి చెప్పింది! మరోవైపు భాస్కర్ వ్యవహార శైలిపై సమగ్ర నివేదికను సిద్ధంచేసి సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనితోపాటు వర్చువల్ విచారణ వేళ అభ్యంతరకర ప్రవర్తనపై భాస్కర్ ను హైకోర్టు వివరణ కోరింది.