వినియోగదారుల కమిషన్ ఆదేశం.. మూడేళ్లుగా జైల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంకాయలపాడులో విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అల్లాబక్షు పలువురితో ప్లాట్ల అమ్మకానికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు.;

Update: 2025-07-11 04:25 GMT

కొన్ని ఉదంతాలు కలలో కూడా ఊహించని విధంగా జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చినప్పుడు.. ఔరా ఇలా కూడా జరిగిందా? అన్న సందేహం కలుగక మానదు. ఏపీలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఈ కోవకు చెందిందే. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తీరును తప్పు పట్టిన వినియోగదారుల కమిషన్.. అతడికి జైలు విధించగా..ఏకంగా మూడేళ్లుగా జైల్లో ఉన్న వైనం వెలుగు చూసింది. ఈ తీరును ప్రశ్నిస్తూ.. సదరు వ్యాపారి కుటుంబం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కమిషన్ వైఖరిని తప్పు పడుతూ.. వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంకాయలపాడులో విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అల్లాబక్షు పలువురితో ప్లాట్ల అమ్మకానికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. అయితే.. చెప్పిన విధంగా సదరు ప్లాట్లను అప్పగించకపోవటంతో కొనుగోలుదారులు 2019లో గుంటూరు డీసీడీఆర్ సీని ఆశ్రయించారు. కొనుగోలుదారులకు నాలుగు వారాల్లో 12 శాతం వడ్డీతో సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

అయితే..ఆయన ఆ ఆదేశాల్ని పట్టించుకోలేదు. దీంతో కొనుగోలుదారులు అతడి తీరును తప్పు పడుతూ మరోసారి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో అతడ్ని కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అల్లాబక్షు పట్టించుకోలేదు. దీంతో.. ఆయనకు వారెంట్ ఇష్యూ చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు.. అతడ్ని అదపులోకి తీసుకొని కమిషన్ ఎదుట 2022 జులై 20న హాజరు పర్చారు.

ఈ సందర్భంగా అతడికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తమ నిర్ణయాన్ని పలుమార్లు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అల్లాబక్ష సోదరుడు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణ స్వీకరించిన ఏపీ హైకోర్టు.. పెనాల్టీ పిటిషన్ల విచారణ సందర్భంగా తమ ఎదుట హాజరు కాకపోవటాన్ని తప్పు పడుతూ జ్యూడిషియల రిమాండ్ కు పంపటాన్ని తప్పు పట్టింది. ఇలా చేయటం వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమేనని పేర్కొంది.

జైలుశిక్ష విధించే అధికారాన్ని నిర్లక్ష్యంగా వినియోగించకూడదని హితవు పలికిన హైకోర్టు.. అల్లాబక్షును వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించింది. దీనికి సంబంధించిన తీర్పును ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందన్ రావు.. జస్టిస్ జె సుమతితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఏమైనా వినియోగదారుల కమిషన్ అరెస్టు ఆదేశాలు జారీ చేయటమే అరుదైన వ్యవహారం కాగా.. మూడేళ్లు రిమాండ్ లోనే ఉండిపోవటం చూస్తే.. కొన్ని సందర్భాల్లో చట్టం ఎంత కఠినంగా అమలవుతుందో ఈ ఉదంతం చెప్పేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News