ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు క్లీన్‌చిట్‌: ఏసీబీ కేసు కొట్టివేత

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో భారీ ఊరట లభించింది.;

Update: 2025-05-08 05:50 GMT

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భద్రత పరికరాల కొనుగోలు టెండర్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసును, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఏసీబీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పిన ఉన్నత న్యాయస్థానం, ఆ అభియోగాలు న్యాయవిచారణలో నిలబడవని స్పష్టం చేసింది. అస్పష్టమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కేసులో పిటిషనర్‌ దిగువ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరమే లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ బుధవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు టెండర్‌ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో 2021 మార్చిలో ఏసీబీ ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన 2022లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

- : పిటిషనర్‌ తరఫు వాదన ఇదీ

ఇటీవల జరిగిన తుది విచారణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు తన వాదనలు వినిపించారు. భద్రత పరికరాల కొనుగోలు ప్రక్రియను నాటి డీజీపీయే ప్రారంభించారని, కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీలను కూడా ఆయనే ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ కోరిక మేరకు కమిటీల్లో సీనియర్‌ అధికారుల పేర్లను మాత్రమే పిటిషనర్‌ సూచించారని, అధికార హోదాను అడ్డుపెట్టుకొని కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు.

పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం ఒక్క రూపాయీ ఖర్చు చేయనందున, ఏబీ వెంకటేశ్వరరావు అనుచిత లబ్ధి పొందే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్‌ కుమారుడికి చెందిన సంస్థ ఇజ్రాయెల్‌ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తోందన్న ఏసీబీ ఆరోపణల్లో వాస్తవం లేదని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థలు లేవని ఇజ్రాయెల్‌ కంపెనీయే స్పష్టత ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ చర్యల వల్ల ప్రభుత్వానికి నష్టం జరగలేదని, అంతిమంగా ఆ టెండర్‌ను అప్పటి డీజీపీ రద్దు చేశారని వివరించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని, కేసును కొట్టేయాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి, ఏసీబీ నమోదు చేసిన కేసుతో పాటు ఛార్జిషీట్‌ను కొట్టివేస్తూ ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద ఊరట లభించినట్లయింది.

Tags:    

Similar News