ఎన్నికల ఖర్చులో టాప్ రేపిన వైసీపీ.
ఎన్నికల ఖర్చు ఏ ఏటికి ఆ ఏడు అపరిమితంగా పెరిగిపోతోంది. ప్రతీ ఎన్నికకూ డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు.;
ఎన్నికల ఖర్చు ఏ ఏటికి ఆ ఏడు అపరిమితంగా పెరిగిపోతోంది. ప్రతీ ఎన్నికకూ డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు తమ చేతికి ఎముక లేదు అన్నట్లుగా పెద్ద ఎత్తున ఖర్చు చేయడం అంతా చూస్తున్నారు. ఇది ఎన్నికల రాజకీయ అవినీతిగా మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు పేర్కొంటున్నప్పటికీ ఎక్కడా ఆగడం లేదు.
ఇదిలా ఉంటే దేశంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఖర్చులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అన్న సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇలా ఏడీఆర్ తన నివేదికల ద్వారా ఎప్పటికపుడు ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న పలు అంశాలను జనాలకు తెలియచేస్తుంది. అలా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను అధికం చేయడంతో పాటు రాజకీయ పార్టీలలో జవాబుదారీతనాన్ని పెంచడం ఒక ఉద్దేశ్యంగా పెట్టుకుంది.
ఇక లేటెస్ట్ గా వెళ్ళడించిన నివేదిక ప్రకారం చూస్తే కనుక దేశంలో ఎన్నికల ఖర్చుని అధికంగా పెట్టిన ప్రాంతీయ పార్టీగా వైసీపీ అగ్రస్థానంలో ఉంది. అంతే కాదు జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ సరసన నిలవడం కూడా విశేషంగా ఉంది.
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వైసీపీ ఏకంగా 325.67 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ద్వారా దేశంలో టాప్ త్రీ ర్యాంక్ ని సొంతం చేసుకుంది. ఇక తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ అయితే 103.26 కోట్ల రూపాయలను ఎన్నికల ఖర్చుగా వినియోగించి ఏడవ స్థానంలో ఉంది. ఏపీలో చూస్తే టీడీపీ ఎన్నికల కోసం కేవలం 34.25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా చాలా తక్కువ స్థానంలో ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఇక సహజంగానే జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ రెండూ మొదటి రెండవ స్థానాలను ఆక్రమించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సార్వత్రిక ఎన్నికల కోసం ఒక వేయి 493.01 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మొదటి స్థానంలో ఉంది. ఇక ఆ తరువాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ తన పరిధిలో ఏకంగా 620.14 కోట్ల రూపాయలను ఎన్నికల ఖర్చుగా చేసింది.
వింత ఏమిటి అంటే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వైసీపీ బీఆర్ఎస్ వంటివే వందల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశాయన్నదే అని అంటున్నారు. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయలు భారీ రాజకీయ అవినీతిని సూచిస్తున్నాయని అంటున్నారు.
మామూలుగా చూస్తే కనుక రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు వ్యక్తులు ఇతరత్రా ద్వారా వివిధ మార్గాల ద్వారా నిధులు పెద్ద మొత్తంలో సమకూరుతాయి. ఎందుకు అంటే ఆయా పార్టీలు అధికారంలోకి వస్తే ఈ విరాళాలు ఇచ్చిన వారంతా ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యంతో ఉంటారని అంటారు.
ఇక చూస్తే కనుక 2024లో దేశంలో పార్లమెంట్ కి జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దాంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేశాయని ఈ నివేదిక చెబుతోంది. ఈ ఎన్నికలు ఆయా పార్టీల రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించేవి కావడంతోనే ఇంతలా ఖర్చు చేసి ఉంటాయని అంటున్నారు.
ఇక దేశం మొత్తం మీద 2024 ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కలిపి పెట్టిన ఎన్నికల ఖర్చు చూస్తే కనుక ఏకంగా మూడు వేల కోట్ల 352.81 కోట్ల రూపాయలుగా ఉందని నివేదిక చెబుతోంది. అదే విధంగా ప్రాంతీయ పార్టీల జాబితాలో బిఆర్ఎస్ అయిదవ స్థానంలో ఉంటే టిడిపి ఏడవ స్థానంలో ఉన్నాయి. అలాగే బీజేడీ 278 కోట్ల రూపాయలు, తృణమూల్ కాంగ్రెస్ 147 కోట్ల రూపాయలు, డిఎంకె 145 కోట్ల రూపాయలు, బిఎస్పి 66 కోట్ల రూపాయలు, సమాజ్ వాదీ పార్టీ 48 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా నివేదిక పేర్కొంది.
ఇక ఏడీఆర్ నివేదికను కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజకీయ పార్టీ నాయకుల నేర చరిత్రను కూడా వెలికి తీస్తుంది. ఎవరి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయన్నది కూడా బయటపెడుతుంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం రాజకీయ అవినీతిని నిర్మూలించడం అలాగే ప్రజలకు మంచి పాలన అందించడమే ఏడీఆర్ వంటి సంస్థలు చేస్తున్న అతి పెద్ద ప్రయత్నంగా ఉంది.