11 సీట్లకు ఉప ఎన్నికలు వస్తే...వైసీపీ సీన్ ఏంటి ?

ఏపీలో రాజకీయ చూస్తే ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతోంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థుల స్థాయి నుంచి అరవీర భయంకర సమరంగా రాజకీయం మారిపోయింది.;

Update: 2026-01-30 01:30 GMT

ఏపీలో రాజకీయ చూస్తే ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతోంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థుల స్థాయి నుంచి అరవీర భయంకర సమరంగా రాజకీయం మారిపోయింది. గత ఇరవై నెలలుగా అసెంబ్లీకి వైసీపీ హాజరు కావడం లేదు. ఒక విధంగా అసెంబ్లీకి బాయ్ కాట్ లాంటిదే వైసీపీ ప్రకటించింది. దాంతో కూటమి ప్రభుత్వం వైసీపీని గట్టిగా విమర్శిస్తోంది. ఇంకో వైపు చూస్తే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ కోరుతోంది. ఈ రకంగా పీటముడి పడిపోయింది. దీనికి మళ్లీ ప్రజలే తీర్పు ఇవ్వాల్సి ఉంటుందేమో అన్న చర్చ కూడా సాగుతోంది.

అనర్హత వేటు :

సభకు ఎవరైనా సభ్యుడు అసెంబ్లీ అరవై పని దినాలలో హజరు కాకపోతే కచ్చితంగా అనర్హత వేసే విధానం అయితే ఉంది. దాంతో ఇరవై నెలలలో వైసీపీ గైర్ హాజరు అయిన విధానం చూస్తూనే అసెంబ్లీ పని దినాలు అరవై కనుక పూర్తి అయితే కచ్చితంగా అనర్హత వేటు వేసేందుకు టీడీపీ కూటమి చురుకుగా పావులు కదుపుతోంది అని అంటున్నారు. ఇది చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈసారి కనీసంగా పాతిక రోజుల పాటు జరిగే బడ్జెట్ సెషన్ తో ఆ అరవై పని దినాలు పూర్తి అవుతాయని లెక్క వేస్తున్నారు.

కూటమి సాహసంతో :

ఏపీలో చూస్తే కూటమి పాలన ఇరవై నెలలు పూర్తి అయింది. మరో నాలుగు నెలలలో రెండేళ్ళు పూర్తి అవుతుంది. ఒక వేళ అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల మీద వేటు పడితే కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అవి కూడా వేటు వేసిన ఆరు నెలల లోపు. అంటే ఏ ఆగస్టు సెప్టెంబర్ లో జరగవచ్చు అని అంటున్నారు. అంటే అప్పటికి కూటమి పాలన రెండున్నర ఏళ్ళకు దగ్గర పడుతుంది. ఒక విధంగా సగం పాలన పూర్తి అయి యాంటీ ఇంకెంబెన్సీ రాజుకుంటున్న దశగా ఉంటుంది. మరి ఆ పరిస్థితుల్లో మూకుమ్మడి ఉప ఎన్నికలకు కూటమి ప్రభుత్వం వెళ్ళేందుకు సిద్ధపడుతుందా అన్నది ఒక చర్చ. అయితే రిస్క్ తీసుకుని కూటమి వేటు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మరో చర్చ.

కూటమికి అడ్వాంటేజ్ :

అధికారంలో ఉండడం కూటమికి భారీ అడ్వాంటేజ్. పైగా మూడు పార్టీలు కలసి కట్టుగా వస్తాయి. వైసీపీ విపక్షంలో ఒంటరి పోరు సాగించాల్సి ఉంటుంది. అధికార బలంతో కూటమి జోరు చేస్తే వైసీపీకి తట్టుకోవడం ఇబ్బ్బంది అవుతుంది. దాంతో మొత్తానికి మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లలో ఎన్ని తిరిగి వైసీపీ పరం అవుతాయన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంటుంది.సాధారణంగా ఉప ఎన్నికలు ఎపుడూ అధికార పక్షానికే అనుకూలంగా ఉంటాయి. మూకుమ్మడి అంటే మెజారిటీ సీట్లు అధికార పక్షం గెలుచుకుంటే వైసీపీకి చావు దెబ్బ తగులుతుంది అని కూడా అంటున్నారు.

వైసీపీకి మైనస్ :

ఇక వైసీపీ ఉప ఎన్నికలు వస్తే ఏ విధంగా జనంలోకి వెళ్తుంది, ఏ రకమైన ప్రచారం చేస్తుంది అన్నది ఒక ప్రశ్న. ఒకసారి ఓటు వేస్తే అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండిపోయారు. దాంతో ప్రజలలో ఈ రకమైన చర్చ జరిగితే మాత్రం అది కచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుంది. కూటమి అయితే ఇదే విషయాన్ని బలంగా జనంలోకి తీసుకుని వెళ్లడం ద్వారా గరిష్టంగా ప్రయోజనం పొందుతుంది అని అంటున్నారు.

సర్వే చేయించారా :

ఇంకో విషయం ఏమిటి అంటే వైసీపీ కూడా అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తే తమ పార్టీ పరిస్థితి ఏమిటి అన్న దాని మీద గ్రౌండ్ లెవెల్ లో లోతైన సర్వే ఒకటి జరిపించింది అని అంటున్నారు. ఈ సర్వేలో చూస్తే సగానికి సగం సీట్లు వైసీపీకి తిరిగి దక్కే సీన్ అయితే ఉండదని వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి ఇదే కనుక జరిగితే మాత్రం 11 సీట్లు ఉన్న వైసీపీ ఏ అయిదారు సీట్లకో పడిపోతే అది ఆ పార్టీ పూర్తిగా కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ ఏ రకమైన భేషజాలకు పోకుండా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద చర్చిస్తే మేలు అన్న సూచనలు అయితే ఉన్నాయి. కూటమి ఎత్తులకు పై ఎత్తు ఇదే అవుతుందని అంటున్నారు. ఉప ఎన్నికలు అంటే కూటమికి పోయేది ఏమీ లేదు, మొత్తం వైసీపీ సీట్లలో ఎన్ని గెలిచినా తమ గొప్పదనమే అని చాటుకుంటుంది, మరింతగా బలం పెంచుకుంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News