జగన్ స్క్రీన్ ప్రెజెన్స్...కూటమికి చాన్స్ !
ఏపీలో చూస్తూండగానే రెండేళ్ళు ఇట్టే గడచిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా సాగాయి.
ఏపీలో చూస్తూండగానే రెండేళ్ళు ఇట్టే గడచిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. టీడీపీ నాయకత్వంలో కూటమి ఎన్నికల్లో గట్టిగా తలపడింది. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించింది. వై నాట్ 175 అన్న వైసీపీ స్ట్రాంగ్ స్లోగన్ లోని డొల్లతనాన్ని బాహాటం చేసింది. అదే సమయంలో అదే 175లో 164 సీట్లను తమ ఖాతాలో వేసుకుని అదిరిపోయే రికార్డుని క్రియేట్ చేసింది 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణం చేసి కొలువు తీరింది. మరో వైపు ఆనాటి నుంచి వైసీపీ విపక్షంలోకి వచ్చింది. మరి రెండు రోజులలో 24 నెలలు పరిపూర్తి అవుతోంది. ఈ రెండేళ్ళ కాలంలో వైసీపీ పక్షాన జగన్ జనంలో ఉన్నది పోరాడింది ఎంత ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద జగన్ ప్రెజెన్స్ ఎంత అన్న చర్చ అయితే సాగుతోంది.
బెంగళూరు టూ తాడేపల్లి :
ఇక జగన్ ఓటమి తరువాత తన మకాం అయితే బెంగళూరు ఎలహంక ప్యాలేస్ కి మార్చేశారు అన్నది తెలిసిందే. ఆయన వారంలో మూడు రోజులు తాడేపల్లి కి వస్తున్నారు. ఈ సమయంలోనే పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. అదే విధంగా ఏమైనా మాట్లాడాలీ అంటే కూడా సమీక్షలు కూడా అక్కడే జరుపుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని పరామర్శలు జనాల వద్దకు వెళ్ళడం వంటివి చేశారు కానీ పెద్దగా అయితే బయటకు వచ్చింది లేదని అంటారు. అదే సమయంలో జగన్ పార్టీలో కూడా పెద్ద నాయకులకే కనిపిస్తున్నారు. వారికే అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయన్నది ఈ రోజుకీ వినిపిస్తున్న ఒక మాటగా ఉంది.
సగటు క్యాడర్ తోనే :
ఏ రాజకీయ పార్టీ అయినా సగటు క్యాడర్ తోనే ముందుకు సాగుతుంది. పార్టీ అన్నది గ్రౌండ్ లెవెల్ లోనే గట్టిగా నిలబడుతుంది. కార్యకర్తలకే ఎక్కువగా ప్రజలకు సంబంధించిన ఆలోచనలు మార్పు వంటివి తెలుస్తాయి. వారితో సమావేశం అయితేనే అధినాయకత్వానికి ఎలా ముందుకు పోవాలన్నది కూడా తెలుస్తుంది. అయితే వైసీపీ విషయంలో మాత్రం అలా లేదనే అంటున్నారు. జగన్ ఎక్కువగా రీజనల్ కో ఆర్డినేటర్లు అలాగే అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులతోనే సమావేశం అవుతున్నారు తప్పించి మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలతో అయితే భేటీలు లేవన్నది మాత్రం పార్టీలో ఒక చర్చగా ఉంది.
మీడియాతో మాత్రం :
ఇక జగన్ మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈ రెండేళ్ళలో కనీసం ఒక డజన్ దాకా నిర్వహించి ఉంటారు అని ఉజ్జాయింపుగా ఒక లెక్క అయితే ఉంది. వాటి ద్వారానే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో జగన్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. సుమారు నెల లేదా రెండునలకు ఒకసారి ఈ మీడియా మీటింగులు జరగడం వల్ల ఆ సమయంలో వచ్చే అన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. దానితోనే ప్రెస్ మీట్లు లెంగ్తీగా మారాయని అంటున్నారు. మరి ఏ విషయం జనంలోకి ఫోకస్ గా వెళ్తుంది అన్నది వైసీపీ పెద్దలు మధింపు చేసుకున్నారా లేదా అన్నది కూడా తెలియదు అని కూడా అంటారు.
అసెంబ్లీకి దూరం :
అదే విధంగా జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో చట్ట సభల ద్వారా ప్రజల గొంతుకను వైసీపీ వినిపించే చాన్స్ ని తానుగానే వదిలేసుకున్నట్లు అయింది. ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వలేదని వైసీపీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వైసీపీ గొంతుక ఆ విధంగా కూడా వినిపించలేని స్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఇక పార్టీ నిర్మాణం మీద జగన్ ఫోకస్ పెడుతున్నారు. తాను అయితే పాదయాత్ర ద్వారానే జనంలోకి రావాలని చూస్తున్నారు. దానికి 2027 మిహూర్తంగా పెట్టుకున్నారు. దాంతో వైసీపీ అధినేత మరో ఏడాది వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తారా అంటే జవాబు అవును అనే వస్తోంది. సో ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ప్రెజెన్స్ అయితే పరిమితంగా ఉంటోంది. అదే సమయంలో కూటమి నుంచి ఎక్కువగా కనిపిస్తోంది. అలా ఏపీలో కూటమికి భారీ చాన్స్ దక్కినట్లు అవుతోంది.