నేనే సీనియర్....బాబు చెప్పింది కరెక్టేనా ?
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నోట మరోసారి పాత మాటే కొత్తగా వచ్చింది.;
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నోట మరోసారి పాత మాటే కొత్తగా వచ్చింది. తానే సీనియర్ అని గోదావరి జిల్లాలలో జరిగిన పర్యటనలో బాబు చెప్పుకొచ్చారు. పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ని అని అన్నారు. తనకంటే సీనియర్ ఎవరూ దేశంలోనే లేరని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మాట ఆయన చాలా కాలం తరువాత అన్నారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు, కానీ ఇపుడు చెప్పడం వెనక కారణం ఏమిటి అన్నది ఒక విశ్లేషణ అయితే బాబు చెప్పిన సందర్భం కూడా ఇక్కడ చూడాల్సి ఉంది అని అంటున్నారు.
అదే మాట మళ్ళీ :
ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు తరచూ ఈ మాట అంటూ ఉండేవారు. అప్పట్లో ఆయన కేంద్రంతో నాలుగేళ్ల పాటు సయోధ్య లో ఉన్నారు. అయితే 2018లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు టీడీపీ గుడ్ బై కొట్టింది. ఆ తరువాత బాబు నిర్వహించిన ధర్మ పోరాటం సభలలో ఈ మాటను ఎక్కువగా ప్రస్తావించేవారు. ఆనాడు ఆయన ఈ కామెంట్స్ చేయడం వెనక రాజకీయ వ్యూహం కూడా ఉంది. అయితే 2019లో ఓటమి తర్వాత మళ్లీ పెద్దగా ఆయన ఈ ప్రస్తావన అయితే చేయలేదు. కానీ కొత్త ఏడాది మొదట్లో ఆయన ఈ కామెంట్స్ చేయడంతో ఒకింత సంచలనంగానూ చర్చకు తావిచ్చేది గానూ ఉంది అని అంటున్నారు.
బాబు సీనియర్ నే :
నిజం చెప్పాలీ అంటే చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ గానే చూడాలి. దేశ రాజకీయాల్లో ఆయన అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయనతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇపుడు ఎవరూ లేరు, పైగా వారిలో చాలా మంది విశ్రాంతి తీసుకుంటున్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా అయి ఆ తర్వాత మంత్రి అయిన బాబు రాజకీయం దాదాపుగా అర్ధ శతాబ్ద కాలంగా ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలతో పాటు వివిధ రాష్ట్రాలలో సీఎంలుగా ఉన్న వారు కూడా సుదీర్ఘమైన బాబు అనుభవంతో పోలిస్తే వెనకబడి ఉన్నారు. మరో వైపు చూస్తే ఉత్తరాదిన బాబుతో సీనియారిటీ కలిగిన వారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన చాలా కాలంగా పెద్దగా క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేశాక ఆ తరువాత అధికారం నుంచి దూరం అయ్యారు. ఇక చూస్తే లాలూ యాదవ్ కూడా సీనియర్ లీడర్ నే కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ విధంగా చూస్తే బాబు సరి సాటి నేతలు అయితే ఎవరూ లేరు. బహుశా ఈ ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కామెంట్స్ చేశారు అని భావించాలి.
ఉద్దేశం ఇదే :
అయితే బాబు ఈ మాటను అహంకారంతో కాకుండా ఒక ధీమాతోనే చెప్పారు అని సందర్భం బట్టి భావించాల్సి ఉంది. తన కంటే ఎవరూ సీనియర్ లేరని, తాను ఏపీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ వాటి వెనక తన అనుభవం ఉందని బాబు చెప్పదలచుకున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే జగన్ బాబు కంటే బాగా జూనియర్ నేతగానే ఉన్నారు. దాంతో బాబు విపక్షంలోని నేతలను దృష్టిలో ఉంచుకుని కూడా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నేనే సీనియర్ అని అనడమే కాదు దేశంలోనే లేరు అనడంతో దాని మీద రకరకాలైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన మోడీ మీద రాజకీయ యుద్ధం ప్రకటించినపుడు ఈ మాటలు ఎక్కువగా అని ఉన్నారు. దాంతో ఆయన కామెంట్స్ అని అలా అన్వయించుకునే వారు ఉండొచ్చు కానీ బాబు అన్నది మాత్రం తన అనుభవం అపారమని అది ఏపీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నాను అన్న మంచి ఉద్దేశ్యంతోనే అన్నారు అని భావించాలి. ఏది ఏమైనా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో బాబు కామెంట్స్ మీద రకరకాలైన విశ్లేషణలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి.