AI టెక్నాలజీ వాడటంలో చంద్రబాబును మించిపోయిన బెంగాల్.. కొత్తగా ఏం చేస్తుందంటే..?

ఆయన ఏ పనిచేసిన అందులో సింహభాగం టెక్నాలజీదే.. చంద్రబాబు తొలినాళ్లలో సీఎంగా ఉండగా, ఐటీని ఉపయోగించుకుని హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారని అంటుంటారు;

Update: 2025-08-22 18:30 GMT

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది ఒక బ్రాండ్. ఆయన ఏ పనిచేసిన అందులో సింహభాగం టెక్నాలజీదే.. చంద్రబాబు తొలినాళ్లలో సీఎంగా ఉండగా, ఐటీని ఉపయోగించుకుని హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారని అంటుంటారు. ఇక ఇప్పుడు AI టెక్నాలజీని వినియోగించుకుని ఏపీని కొత్త పుంతలు తొక్కించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే AI టెక్నాలజీ వాడటంలో చంద్రబాబును వెనక్కి నెట్టేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కూడా AI వినియోగంలో నేను సైతం అంటూ సవాల్ విసురుతోంది.

AI టెక్నాలజీ వినియోగంపై చంద్రబాబు దూకుడుగా ముందుకు వెళుతుంటే.. ఈ ఆధునిక టెక్నాలజీ వాడుకుని నేరాల నియంత్రణకు ప్రణాళిక రచిస్తోంది బెంగాల్ ప్రభుత్వం. జైళ్లలో నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నేరస్తులపై నిఘా కోసం AI ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు బెంగాల్ పోలీసులు ప్రకటించారు. ఇటీవల బెంగాల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కరుడు గట్టిన నేరస్తులు బయట జరిగే నేరాలకు జైలు నుంచి ప్రణాళిక వేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

గంజాయి అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యలు వంటి నేరాలకు ప్లాన్ చేస్తూ శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో బెంగాల్ జైళ్లు నేరాలకు నిలయాలుగా మారిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకునేందుకు వీలుగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బెంగాల్ వ్యాప్తంగా సుమారు 60 జైళ్లు ఉన్నాయని చెబుతున్నారు. జైళ్లలో ఇప్పటికే అత్యాధునిక కెమెరాలు ఉన్నప్పటికీ ఖైదీలు తమ దృష్టి నుంచి తప్పించుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో AIతో సీసీ కెమెరాలను అనుసంధానిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రతి ఖైదీ బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరుస్తామన్నారు. ఇవి సాధారణ కెమెరాల్లా రికార్డు అవడమే కాక జైలు లోపల అనుమానాస్పద కదలికలు, తగాదాలు, విధ్వంసం, తప్పించుకునే ప్రయత్నాలు వంటివాటిని గుర్తించి వెంటనే జైలు గార్డులను అప్రమత్తం చేస్తాయని తెలిపారు. ఇందులో ఉన్న ముఖ గుర్తింపు ద్వారా భోజన సమయాల్లో హాజరు తీసుకునే సమయంలో గైర్హాజరైన వారిని పారిపోవడానికి ప్రయత్నించిన వారిని ట్రాక్ చేసి అధికారులను అప్రమత్తం చేస్తుంది.

ముఖ్యమైన కేసుల్లో అరెస్టైన కరుడు గట్టిన నేరస్తులు ప్రత్యేక నిఘాలో ఉంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా AI ద్వారా జైళ్లలో సెల్ ఫోన్లు, పదునైన ఆయుధాలు, మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులను గుర్తించవచ్చని తెలిపారు. ఈ AI-ఆధారిత వీడియో విశ్లేషణలు ఖైదీల ప్రవర్తన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ధోరణులను కూడా అంచనా వేయగలవన్నారు. దీనివల్ల అధికారులు ముందుగానే జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News