50 మందిని బలితీసుకున్న మోస్ట్ వాంటెడ్.. విజయవాడలో అరెస్టు
విజయవాడలో పోలీసులకు పట్టుబడిన మావోయిస్టుల్లో పలువురు మోస్ట్ డేంజరస్ తీవ్రవాదులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.;
విజయవాడలో పోలీసులకు పట్టుబడిన మావోయిస్టుల్లో పలువురు మోస్ట్ డేంజరస్ తీవ్రవాదులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 18న పోలీసు ఇంటెలిజెన్స్ సమాచారంతో పెనమలూరు మండలం న్యూ ఆటోనగర్ లో 28 మంది మావోయిస్టులను ఒకేసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు లభించిన క్లూతో విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో తలదాచుకున్న మరో నలుగురిని పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిలో పొడియా భీమా అనే మావోయిస్టు పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ అని విచారణలో తేలింది.
2003లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన పొడియా భీమా గత 20 ఏళ్లలో 50 మంది ప్రాణాలు బలి తీసుకున్నట్లు కేసులు నమోదయ్యాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులతోపాటు స్థానికులు హడలిపోతున్నారు. ప్రమాదకర వ్యక్తులు ఇన్నాళ్లు తమ మధ్యే ఉన్నారని తెలుసుకుని ప్రసాదంపాడు ప్రాంతీయులు ఉలిక్కిపడుతున్నారు. ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు ఉన్నారని తెలిసిన వెంటనే పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు. వీరిని పొడియా భీమా, మంగి డొక్కుపాడి, మడలం లక్మా, మడవి చిన్నయ్ గుర్తించారు. ఈ నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
ప్రసాదంపాడులో పట్టుబడిన నలుగురిదీ చత్తీస్ఘడ్ రాస్ట్రమే. బీజాపూర్ జిల్లా ఉమ్మేరిపాలెం గ్రామానికి చెందిన మడవి చిన్నయ్ అలియాస్ మనీలా, గూడా గ్రామానికి చెందిన మడలం లక్మా అలియాస్ మదన్ దళానికి కమ్యూనికేషన్ వ్యవస్థలా పనిచేశారు. వారిలో లక్మా సంగావ్ డివిజనల్ కమిటీ మెంబర్. చిన్నయ్ పామేడు కమిటీ ఇంచార్జి. ఇద్దరూ చిన్నతనంలోనేమావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. ఆయా ఏరియాల్లో ఉండే గ్రామాల్లోకి వెళ్లి యువతీ యువకులకు మావోయిస్టు పాఠాలు చెప్పేవారు. వారిని నెమ్మదిగా అడవుల్లోకి తీసుకువెళ్లేవారు. ఈ క్రమంలో మావోయిస్టుల సమాచారం భద్రతా దళాలకు చేరవేస్తున్నారన్న అనుమానంతో ఇన్ఫార్మర్లను హతమార్చేవారు.
అదేవిధంగా కుంట జిల్లా పాలమడుగు గ్రామానికి చెందిన పొడియా భీమా అలియాస్ రంగు యవ్వనంలో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. నెమ్మదిగా దళానికి దగ్గరైన భీమా పలు విధ్వంసకర ఘటనల్లో భాగం పంచుకున్నాడు. అతడి తెలివితేటలతో దళంలో అంచెలంచెలుగా పైకి ఎదిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలకు రక్షణగా ఉండే గెరిల్లా ఆర్మీలో భీమా కీలకంగా పనిచేసినట్లు చత్తీస్ ఘడ్ పోలీసులు సమాచారమిచ్చారు. భీమా వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం దళంలోకి ప్రవేశించిన భీమా ప్రస్తుతం గెరిల్లా బెటాలియన్ పార్టీకి కమాండర్ గా ఉన్నాడని అంటున్నారు. అంతేకాకుండా దక్షిణ బస్తర్ ఏరియా స్టేట్ కమిటీలో సభ్యుడిగానూ కొనసాగుతున్నాడు.
దాదాపు 20 ఏళ్లుగా మావోయిస్టు గెరిల్లా ఆర్మీలో పనిచేసిన భీమా.. దాదాపు 50 మందిని పొట్టనపెట్టుకున్న పలు దాడుల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ కు వెళ్లిన భద్రతా బలగాల్లో దాదాపు 30 మంది వరకు భీమా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. అదేవిధంగా 2017లో గుర్కపూర్ లో జరిపిన దాడిలో 22 మంది పోలీసులు ఒకేసారి మృతిచెందారు. ఈ దాడిలో భీమాయే బాంబు అమర్చాడని, పేలుడులో అతడి కాలు కూడా కోల్పోయాడని పోలీసులు గుర్తించారు. ఈ దాడి తర్వాత మావోయిస్టు అగ్రనేతలకు భీమా మరింత దగ్గరయ్యాడని చెప్పాడు. అయితే కాలు పోయినా భీమా మావోయిస్టులకు దూరమవ్వలేదని, ఒంటి కాలితోనే దళంలో సేవలు అందిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏరియా కమిటీ సభ్యురాలు మంగిని భీమా ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి మావోయిస్టు పార్టీనే తమ పద్ధతిలో వివాహం జరిపించింది. ఈ నలుగురు ఒకే ఇంట్లో ఉండగా, పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి అరెస్టు చేశారు. భీమాపై కేసులు, అతడి చేతిలో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు.