దళపతికి ఈసీ షాక్.. ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు!
తమిళనాడు ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్ కి వరుస షాక్ లు తగులుతున్నాయి.;
తమిళనాడు ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్ కి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల నిబంధనలపై సరైన అవగాహన లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో విజయ్ పై ఎన్నికల కమిషన్ సీరియస్ అవుతోంది. విజయ్ తోపాటు ఆయన పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు నియమావళిని అతిక్రమించేలా ఉన్నాయని ప్రత్యర్థులు ఫిర్యాదులు చేయడంతో ఒకే రోజు మూడు కేసులు నమోదు చేసేలా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం తమిళనాడులో తీవ్ర కలకలానికి కారణమవుతోంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహణ, ట్రాఫిక్ కు అంతరాయం కల్పించారనే కారణాలతో విజయ్ పై మూడు వేర్వేరు పోలీసుస్టేషన్లలో గురువారం కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ ఫిర్యాదు చేయడంతో వెస్ట్ మాంబలం, సుంగంబాక్కం, వేపేరి పోలీసు స్టేషన్లలో టీవీకే అధినేత విజయ్ తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వెస్ట్ మాంబలంలో సభ నిర్వహణకు అనుమతి తీసుకున్న విజయ్, అనుమతి లేకుండా భారీ రోడ్ షో నిర్వహించారని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు.
దీంతో విజయ్, టీ.నగర్ టీవీకే అభ్యర్థి ఎన్.ఆనంద్ పై బీఎన్ఎస్ సెక్షన్ 223 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా సుంగం బాక్కంలో వల్లువర్ కొట్టం వద్ద ఎటువంటి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని, జనాలను భారీగా సమీకరించారని విజయ్, జేసీటీ ప్రభాకరన్ పై మరో కేసు నమోదు చేశారు. వేపేరిలో ఎన్నికల మార్గదర్శకాలను గాలికొదిలేసి ఎగ్మోర్ అభ్యర్థి రాజ్‌మోహన్‌తో కలిసి ప్రచారం చేసినందుకు మరో కేసు నమోదైంది. ఇక వేపేరిలో ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఎగ్మోర్ టీవీకే అభ్యర్థి రాజ్ మోహన్ తో కలిసి ప్రచారం చేశారని ఇంకో కేసు పెట్టారు.
ఇలా మొత్తం విజయ్ పై ఒకే రోజు మూడు చోట్ల కేసులు నమోదయ్యాయి. మరోవైపు సినీ గ్లామర్ తో విజయ్ ఎక్కడికి వెళ్లినా జనం ఎగబడి వస్తున్నారు. దీంతో జనాలను నియంత్రించడం పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా జనాలను సమీకరిస్తున్నారని, రోడ్ షో షరతులను పాటించడం లేదని పోలీసు అధికారులు విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విజయ్ టార్గెట్ గా వరుసగా నమోదు అవుతున్న కేసులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా విజయ్ పై కేసులు బనాయిస్తోందని టీవీకే కార్యకర్తలు ధ్వజమెత్తుతున్నారు.