ద్విభాషా విధానానికే విజయ్ ఓటు
దేశమంతా త్రిభాషా సూత్రం అమలు అవుతోంది. నెహ్రూ కాలం నుంచి అది విధానంగా ఉంది.
దేశమంతా త్రిభాషా సూత్రం అమలు అవుతోంది. నెహ్రూ కాలం నుంచి అది విధానంగా ఉంది. అయితే తమిళనాడు మాత్రం అందులో హిందీని పూర్తిగా తీసి పక్కన పెడుతోంది. హిందీ హిందూ ఈ రెండూ వద్దు అని ద్రవిడ పార్టీలు దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న సంగతి విధీతమే. ఇపుడు కొత్తగా అధికారం చేపట్టిన టీవీకే ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ ద్విభాషా విధానానికే ఓటు వేసింది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తాజాగా బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా టీవీకే ప్రభుత్వం విధానాలను సిద్ధాంతాలను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తన ప్రసంగం ద్వారా చదివి వినిపించారు.
అదే కొనసాగుతుంది :
ఇక తమిళనాడు రాష్ట్రంలో ద్విభాషా విధానం కొనసాగుతుందని రాజేంద్ర అర్లేకర్ వెల్లడించడం విశేషం. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి, విశ్వాస తీర్మానంలో నెగ్గిన తర్వాత తమిళనాడు శాసనసభ మొదటి సమావేశం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగంతో ప్రారంభమైంది. ఇక అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. కేంద్రం నుండి నిధుల న్యాయమైన పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెప్పడం విశేషం. తమిళనాడుకు ఆర్థిక నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానంపైన సమగ్ర నివేదికను విడుదల చేస్తామని గవర్న ప్రసంగం ద్వారా టీవీకే చెప్పింది అన్న మాట.
సామాజిక న్యాయ సర్వే :
అంతే కాదు తమిళనాడులో ప్రత్యేకంగా సామాజిక న్యాయ సర్వేని నిర్వహిస్తామని కూడా గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణనలో భాగంగా కులాల గణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లుగా చెప్పారు. ప్రతి వర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించడమే నిజమైన సామాజిక న్యాయం అనేది టీవీకే ప్రభుత్వం ప్రాథమిక విధానంగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనను పూర్తి చేసిన తర్వాతనే తమిళనాడు ప్రభుత్వం సామాజిక న్యాయ సర్వేను నిర్వహిస్తుందని పేర్కొన్నరు.
డీఎంకే మీద విసుర్లు :
గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలోని మైనింగ్ రంగంలో నెలకొన్న అవినీతి పద్ధతుల కారణంగా ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండి పడుతోందని టీవీకే ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల తమిళనాడులో ఖనిజ వనరుల వెలికితీత సమర్థవంతంగా పర్యావరణానికి హాని కలగకుండా జరిగేలా తమ ప్రభుత్వం చూస్తుందని స్పష్టం చేసింది. ఆదాయం దారి మళ్లించబడకుండా ప్రభుత్వ ఖజానాకు చేరేలా సరైన నియంత్రణ అమలు చర్యల ద్వారా వ్యవస్థీకృత అక్రమ మైనింగ్ మరియు పన్ను ఎగవేతలను కఠినంగా అణిచివేస్తామని కూడ చెప్పడం విశేషం.
మాదకద్రవ్యాల సంస్కృతి :
అంతే కాదు గత కొన్నేళ్లుగా తమిళనాడులో మాదకద్రవ్యాల సంస్కృతి తీవ్రంగా వేళ్లూనుకుందని టీవీకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ముప్పును అరికట్టడంలో గత ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కూడా విమర్శించింది. రాష్ట్రంలో తమిళనాడులో శాంతిభద్రతల క్షీణతకు ప్రధాన కారణం మాదకద్రవ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉండటమే అని గుర్తు చేస్తోంది. మాదకద్రవ్య రహిత తమిళనాడును సృష్టించడానికి టీవీకే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా పేర్కొంది. మొత్తానికి చూస్తే అటు ద్రవిడ పార్టీల మీద మరో వైపు కేంద్రం మీద కూడా టీవీకే తన స్టాండ్ ని తెలియచేస్తూ తన పంధా వేరు అన్నది గవర్నర్ ప్రసంగం ద్వారా తేటతెల్లం చేసింది అని అంటున్నారు.