ఒక్క రోజే.. సీన్ రివర్స్! మిత్రపక్షాల సెగతో సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. తనపై ఎలాంటి విమర్శలు వచ్చిన వెనువెంటనే స్పందిస్తున్నారు. ప్రత్యర్థులకు అస్త్రాలు అందకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు. తన ఓఎస్డీగా రిక్కీ రాధన్ పండిట్ నియామకంపై మిత్రపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనువెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఓఎస్డీగా రిక్కీ రాధన్ నియమాకాన్ని నిలిపివేస్తూ ఒక్కరోజులోనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం విజయ్ స్పీడ్ ఊహించలేకపోతున్నట్లు వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి.
రాజకీయాలకు కొత్త అయినప్పటికీ విజయ్ చాలా పరిణితి ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. తన ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ అలియాస్ రిక్కీ రాధన్ పండిట్ ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నియామకం ద్రవిడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పెరియార్ స్థాపించిన హేతువాద సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ నియామకం ఉందని మిత్రపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ తోపాటు సీపీఎం కార్యదర్శి షణ్ముగం, విసీకే నేత రవికుమార్ తదితరులు బహిరంగంగానే సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సిన ప్రభుత్వం, జ్యోతిష్యులకు అధికారిక పదవులు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
దీంతో ముఖ్యమంత్రి విజయ్ తన నిర్ణయాన్ని ఒక్క రోజులోనే సమీక్షించుకున్నారు. రిక్కీ రాధన్ నియామకాన్ని రద్దుచేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విజయ్ చాకచక్యంగా వ్యవహరించారని ప్రశంసలు అందుకుంటున్నారు. రాజకీయంగా పరిణతి ప్రదర్శిస్తూ మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా, విమర్శలకు చెక్ పెట్టారని సీఎంను పరిశీలకులు అభినందిస్తున్నారు. కాగా, ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్ కి మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలని ఈ ఉదంతం సూచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏవరీ రిక్కీ రాధన్?
కాగా, ముఖ్యమంత్రి ఓఎస్డీగా రిక్కీ రాధన్ నియామకం, అది తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆయన ఎవరనేది తెలుసుకోడానికి చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. రిక్కీ రాధన్ పూర్తి పేరు రాధన్ పండిట్ వెట్రివేల్. విజయ్ కు మాత్రమే కాకుండా తమిళనాడులో ప్రముఖ నేతలకు జ్యోతిష్యుడిగా ఆయన వ్యవహరించేవారు. మాజీ ముఖ్యమంత్రి ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత కూడా రిక్కీ జ్యోతిష్యంపై ఆధారపడేవారని చెబుతారు. తమిళనాడుకే కాకుండా రిక్కీ రాధన్ పండిట్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణుడుగా పేరు గడించారు. గత కొన్నేళ్లుగా ఆయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ పార్టీకి వ్యూహకర్త
విజయ్ తన రాజకీయ పార్టీ ప్రకటించిన సమయం నుంచి, పార్టీ జెండా ఆవిష్కరణ, రాష్ట్ర స్థాయి సభల నిర్వహణ వరకు ప్రతి విషయంలోనూ రిక్కీ రాధన్ పండిట్ సూచనలను పాటించినట్లు సమాచారం. కేవలం జ్యోతిష్యుడిగానే కాకుండా, పార్టీ వ్యూహకర్తగా కూడా ఆయన విజయ్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. దీంతో తన రాజకీయ ఎదుగుదలలో రిక్కీ సలహాలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. పాలనలో కూడా తన వెన్నంటే ఉండే వ్యక్తి కావాలని భావించి ఓఎస్డీగా నియమించారని సమాచారం. అయితే ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విజయ్ తన నిర్ణయాల కోసం జ్యోతిష్యులపై ఆధారపడుతున్నారా? ఇది మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కాదా? అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. అంతేకాకుండా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం శాస్త్రీయ దృక్పథంతో కాకుండా, జ్యోతిష్యుల సలహాలతో నడుస్తుందనే ప్రచారం ఎక్కువగా సాగింది. దీంతో సీఎం విజయ్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. విమర్శలకు చెక్ చెబుతూ రిక్కీ నియామకాన్ని రద్దు చేశారు.