ఇద్దరు ఎమ్మెల్యేలే.. కానీ డిప్యూటీ సీఎం పదవి డిమాండ్.. విజయ్ ప్రభుత్వానికి వీసీకే షాక్!
ముఖ్యంగా దళిత హక్కుల గళంగా గుర్తింపు పొందిన విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) ఇప్పుడు అధికార పీఠాన్ని శాసించే స్థాయికి చేరడం గమనార్హం.;
తమిళనాడు రాజకీయ యవనికపై ఇప్పుడు సరికొత్త సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు భిన్నంగా ఇప్పుడు చిన్న పార్టీలు 'కింగ్‌మేకర్' పాత్రలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా దళిత హక్కుల గళంగా గుర్తింపు పొందిన విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) ఇప్పుడు అధికార పీఠాన్ని శాసించే స్థాయికి చేరడం గమనార్హం.
విముక్తి చిరుతల ప్రస్థానం.. సామాజిక పోరాటం నుండి రాజకీయ శక్తి వరకు...
“విడుతలై చిరుతైగల్ కచ్చి” అంటే “విముక్తి చిరుతలు” అని అర్థం. ఈ పార్టీ పునాదులు 1982లో పడ్డాయి. మలైచామీ నేతృత్వంలో “దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా (డీపీఐ)”గా ప్రారంభమైన ఈ ఉద్యమం.. 1989లో తిరుమావళవన్ రాకతో రాజకీయ మలుపు తిరిగింది. ఫోరెన్సిక్ విభాగంలో తన వృత్తిని వదులుకుని, అణగారిన వర్గాల కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన తిరుమావళవన్, వీసీకేని తమిళనాడులోని బలమైన సామాజిక శక్తుల్లో ఒకటిగా తీర్చిదిద్దారు.
ఆరంభంలో ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ పార్టీ 1999 తర్వాతే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. అప్పటి నుండి వ్యూహాత్మక పొత్తులతో తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2001లో డీఎంకేతో 2006లో ఏఐడీఎంకేతో ఆపై మళ్ళీ మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి అనుగుణంగా పొత్తులు మారుస్తూ అసెంబ్లీలో తన ఉనికిని చాటుకుంది.
2026 ఎన్నికల ఫలితాలు.. చిన్న పార్టీలదే అసలు హవా!
ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమిళనాట ఒక విచిత్రమైన పరిస్థితిని కల్పించాయి. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరువవుతున్న తరుణంలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న వీసీకే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పార్టీగా అవతరించింది.
విజయ్ నేతృత్వంలోని కూటమి మద్దతు ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ అయిన 118 వద్దే ఉండటంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మద్దతు ప్రభుత్వం మనుగడకు అత్యవసరమైంది. ఒక్క ఎమ్మెల్యే పక్కకు తప్పుకున్నా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండటంతో చిన్న పార్టీలు తమ రాజకీయ బేరసారాలకు పదును పెట్టాయి.
డిప్యూటీ సీఎం డిమాండ్: హాట్ టాపిక్‌గా మారిన వీసీకే వ్యూహం
కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వీసీకే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. "అధికారంలో భాగస్వామ్యం లేకపోతే మద్దతుకు అర్థం లేదు" అన్న ధోరణిలో వీసీకే నాయకత్వం ఉండటం విజయ్‌కు సవాలుగా మారింది.
ప్రభుత్వం ఇంకా కొలువుదీరకముందే ఈ స్థాయి డిమాండ్లు వినిపిస్తుండటంపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. చిన్న పార్టీల అండ లేకుండా అడుగు ముందుకు వేయలేని స్థితిలో విజయ్ ఉండటంతో ఆయన ఈ ఒత్తిళ్లను ఎలా అధిగమిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
విజయ్ ముందున్న సవాళ్లు.. సినిమాలా రాజకీయాలు సులభం కావు!
వెండితెరపై మాస్ లీడర్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన విజయ్... ఇప్పుడు నిజ జీవిత రాజకీయ రణరంగంలో పరీక్షను ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రజాదరణతో ఎన్నికల్లో నెగ్గవచ్చు కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు స్థిరంగా నడపడం అనేది కత్తిమీద సామే.వీసీకే వంటి పార్టీల భారీ డిమాండ్లను నెరవేరిస్తే ఇతర మిత్రపక్షాల నుండి కూడా అదే స్థాయి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం ఒక్క సీటు మెజారిటీతో ప్రభుత్వం నడపడం అంటే నిరంతరం 'రిసార్ట్ రాజకీయాల' భయం వెంటాడటమే. డీఎంకే అన్నాడీఎంకే వంటి అనుభవం ఉన్న పార్టీలు ఈ అస్థిరతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తాయి.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సంధి కాలంలో ఉన్నాయి. ప్రజాదరణకు, రాజకీయ చతురతకు మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయ్ ఏ మేరకు సమతౌల్యం పాటిస్తారో వేచి చూడాలి. చిన్న పార్టీల ఆశలు, పెద్ద పార్టీల ఎత్తుగడల మధ్య తమిళనాట సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది.