ట్రంప్ తో షరీఫ్ భేటి.. అమెరికాకు మరింత చేరువ అవుతోన్న పాకిస్తాన్?

ఈ భేటీలో పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. పాక్‌లో వరదల కారణంగా ఏర్పడిన ఆర్థిక , మానవతా సంక్షోభంపై అమెరికా సాయం కోరడం ముఖ్య కారణం.;

Update: 2025-09-16 17:02 GMT

అమెరికా-పాకిస్థాన్‌ సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ , ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 25న వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) సమావేశాల సందర్భంగా ఈ భేటీ జరగవచ్చని సమాచారం. అయితే ఈ భేటీపై ఇరు దేశాల ప్రభుత్వాల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భేటీలో కీలక అంశాలు

ఈ భేటీలో పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. పాక్‌లో వరదల కారణంగా ఏర్పడిన ఆర్థిక , మానవతా సంక్షోభంపై అమెరికా సాయం కోరడం ముఖ్య కారణం. ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడులు , భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.. బలూచిస్థాన్‌ తిరుగుబాటు, తెహ్రీకే తాలిబన్‌ (TTP) దాడులను ఎదుర్కోవడానికి అమెరికా సహాయం కోసం అభ్యర్థించడం ముఖ్యంగా కనిపిస్తోంది. .

పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ ఇప్పటికే పలు మార్లు అమెరికాలో పర్యటించారు. మునుపటి పర్యటనలో ట్రంప్‌తో సమావేశమైన ఆయన, కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి వెళ్లడం ఈ భేటీకి ప్రాధాన్యతను పెంచుతోంది.

పాక్‌కు అమెరికా ఎందుకు ముఖ్యం?

పాకిస్థాన్‌కు అమెరికాతో సంబంధాలు కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాదు, ఆర్థిక భద్రత కూడా.. పాక్‌ ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) , ప్రపంచ బ్యాంక్ నుండి రుణాల కోసం అమెరికా మద్దతు తప్పనిసరి. అలాగే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) ఆంక్షలు సడలించాలన్నా అమెరికా సహకారం కావాలి.

*అమెరికాకు పాక్‌ ఎందుకు అవసరం?

అమెరికా దృష్టిలో పాకిస్థాన్‌కు దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రష్యా , చైనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో పాకిస్థాన్‌ను తమ వైపు ఉంచుకోవడం అమెరికాకు ఒక కీలకమైన "బ్యాలెన్స్‌ కార్డు". దీనితో పాటు పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత పెరిగితే, అక్కడి అణువాయుధాలు ఉగ్రవాదుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందనే భయం అమెరికాను వెంటాడుతోంది. ఈ టెక్నాలజీ లేదా పదార్థాలు ఇరాన్‌ వంటి దేశాలకు చేరకుండా నిరోధించాలనేది అమెరికా లక్ష్యం.

*భవిష్యత్తుపై ప్రభావం

ఈ భేటీ నిజమైతే అది అమెరికా-పాక్‌ సంబంధాలలో ఒక కొత్త మలుపుగా పరిగణించవచ్చు. ఈ పరిణామాలను భారత్‌తో పాటు రష్యా, చైనా వంటి దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. సెప్టెంబర్‌ 25న జరగబోయే ఈ భేటీ దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది స్నేహం కంటే ఒక పక్కా వ్యాపారం మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాక్‌ తన ఆర్థిక, భద్రతా అవసరాల కోసం, అమెరికా తన వ్యూహాత్మక ఆధిపత్యం కోసం ఒకరినొకరు చేరుకుంటున్నారని వారు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News