వైట్ హౌస్ వాదనకు బలం చేకూర్చిన ఇరాన్... ట్రంప్ ఇక తగ్గరుగా..!
మరోవైపు... ఇరాన్ లో అణుకేంద్రాలపై అమెరికా దాడులు అంత ప్రభావం చూపించలేదని.. వాటిని ధ్వంసం చేయాలంటే అమెరికా ప్రయోగించిన బాంబుల స్థాయి సరిపోదని చైనా నిపుణులు తెలిపారు.;
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులు, తోమహాక్ క్షిపణులు ప్రయోగించి దాడి చేసింది. అయితే... ఈ దాడుల్లో ఆ అణు కేంద్రాలు ఎంతవరకు దెబ్బతిన్నాయనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ విషయంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా... ఇరాన్ పై అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’ పేరిట ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో తమ సైన్యం భారీ దాడులకు పాల్పడిందని.. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనమయ్యాయని.. ఇప్పట్లో ఇరాన్ అణ్వాయుధాలు చేసుకునే ఛాన్స్ లేదని, ఆ సామర్థం పూర్తిగా పోయిందని చెబుతున్నారు.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ట్రంప్ అయితే.. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగాను, అటు మీడియా ముందు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇదే విషయంపై స్పందించిన ఇజ్రాయెల్... ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేసిన అమెరికా ప్రపంచానికే మేలు చేసిందని కొనియాడుతున్నారు.
మరోవైపు... ఇరాన్ లో అణుకేంద్రాలపై అమెరికా దాడులు అంత ప్రభావం చూపించలేదని.. వాటిని ధ్వంసం చేయాలంటే అమెరికా ప్రయోగించిన బాంబుల స్థాయి సరిపోదని చైనా నిపుణులు తెలిపారు. ఆ దాడుల వల్ల ఇరాన్ కు పరిమితంగానే నష్టం వాటిల్లిందని వెల్లడించారు. దీనికి తోడు... ఈ దాడుల్లో ఇరాన్ కు జరిగిన నష్టంపై పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఓ నివేదిక తయారుచేసింది.
ఇందులో భాగంగా.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ కు పరిమితమైన నష్టం మాత్రం వాటిల్లిందని.. ఈ నేపథ్యంలో ఇరాన్ కొన్ని నెలల్లోనే తన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేసుకోవచ్చని తెలిపింది! దీనిపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇది ఫేక్ రిపోర్ట్ అని అన్నారు. ఈ సమయలో.. ట్రంప్ మాటలకు ఇరాన్ నుంచే మద్దతు లభించడం గమనార్హం!
అవును... తమ అణుకేంద్రాలపై అమెరికా చేసిన దాడులపై ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అగ్రరాజ్య దాడులతో తమ అణుకేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అంగీకరించారు. ప్రస్తుతం వాటి పరిస్థితిని ఇరాన్ అణుసంస్థ, ఇతర ఏజెన్సీలు పరిస్థితిని అంచనా వేస్తున్నాయని చెప్పారు.
అయితే.. ఆ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో... ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ వాదనకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా.. ఏజెన్సీల అంచనాలకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దీనిపై మరింత స్పష్ట వస్తుందని చెబుతున్నారు.