యూఎస్‌ గ్రీన్‌ కార్డ్‌ : భారతీయులకు భారీ షాక్

ఈ నేపథ్యంలో గ్రీన్‌ కార్డ్ ద్వారా అమెరికాలో స్థిర నివాసం పొందాలనుకునే భారతీయులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.;

Update: 2025-10-17 20:30 GMT

అమెరికా వీసా విధానాల్లో కఠినతర మార్పులు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, వలస పాలసీలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌ కార్డ్ ద్వారా అమెరికాలో స్థిర నివాసం పొందాలనుకునే భారతీయులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు చేసిన ప్రకటన ప్రకారం.. యూఎస్‌ డైవర్సిటీ వీసా లేదా గ్రీన్‌ కార్డ్‌ లాటరీలో భారతీయులకు 2028 వరకు పాల్గొనే అర్హత ఉండదు.

* ఎందుకు అవకాశం లేదు? అసలు కారణం ఏంటి?

డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ యొక్క ప్రధాన లక్ష్యం.. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలసలు పంపే దేశాల ప్రజలకు అవకాశమివ్వడం. ప్రతి సంవత్సరం సుమారు 50,000 వీసాలు ఇలాంటి దేశాల అభ్యర్థులకు కేటాయిస్తారు. అయితే, గత కొన్నేళ్లుగా భారత్‌ నుంచి అమెరికాకు భారీ స్థాయిలో వలసలు వెళ్తుండటంతో, భారత్ ఈ అర్హత పరిమితిని మించి వేసింది. అందుకే ఈ లాటరీ నుంచి భారత్‌ను తాత్కాలికంగా తప్పించారు.

* అధికారులు వెల్లడించిన గణాంకాలు:

2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. 2022లో ఈ సంఖ్య 1,27,010కి పెరిగింది. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు చేరుకున్నారు. ఈ సంఖ్యలు దక్షిణ అమెరికన్‌ (99,030), ఆఫ్రికన్‌ (89,570), యూరోపియన్‌ (75,610) వలసదారుల కంటే ఎక్కువగా ఉండటంతో, భారతీయులను ఈ లాటరీ ప్రోగ్రామ్‌ నుంచి తప్పించారు. ఈ నిబంధన 2028 వరకు అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

* లాటరీలో పాల్గొనలేని ఇతర దేశాలు

భారతదేశంతో పాటు, అధిక సంఖ్యలో వలసలు పంపుతున్న కారణంగా చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా 2026 వరకు ఈ లాటరీకు అర్హులు కావు.

* పెరోల్‌ ఫీజు పెంపు: 1,000 డాలర్లు

ఇదిలా ఉండగా అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ (USCIS) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా లేదా పాస్‌పోర్ట్‌ లేకుండా అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించే “పెరోల్‌” ఫీజును $1,000 డాలర్లకు పెంచింది.

ఈ ఫీజు కొత్త దరఖాస్తుదారులు, రీ-పెరోల్‌, లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) కస్టడీ నుంచి విడుదల కావాలనుకునే వలసదారులందరికీ వర్తిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న ఇతర బయోమెట్రిక్‌ లేదా ఇమిగ్రేషన్‌ సేవల రుసుములకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

* ట్రంప్‌ విధానాల ప్రభావం

‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ పేరుతో ట్రంప్‌ ప్రవేశపెట్టిన వలస సంస్కరణ బిల్లులో ఈ పెరోల్‌ రుసుము తప్పనిసరి చేయబడింది. మొత్తంగా, అమెరికా వలస విధానాలు మరింత కఠినతరం అవుతుండటంతో, గ్రీన్‌ కార్డ్‌ లాటరీ ద్వారా స్థిర నివాసం పొందాలనుకునే భారతీయులు కనీసం 2028 వరకు నిరీక్షించక తప్పదు. రాబోయే కాలంలో అమెరికా వీసాలు, గ్రీన్‌ కార్డులపై మరింత పోటీ, నియంత్రణలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News