నాగబాబా లేక బాల శౌరీనా ?
ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి మొదలు కాబోతున్నాయి. అవి ఆగస్టు రెండో వారం దాకా కొనసాగనున్నాయి.;
ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి మొదలు కాబోతున్నాయి. అవి ఆగస్టు రెండో వారం దాకా కొనసాగనున్నాయి. ఆ తరువాత స్వతంత్ర దినోత్సవం వేడుక చూసుకుని కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు మార్పులు చేర్పులు చేసేందుకు ముహూర్తం నిర్ణయించారని అంటున్నారు.
అంటే ఆగస్టు మూడవ వారంలో కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు ఉంటాయని ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈసారి మంత్రివర్గ విస్తరణలో వచ్చే ఏడాది దేశంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కొత్త వారిని తీసుకుంటారు అని అంటున్నారు. అలా తమిళనాడు నుంచి అక్కడ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి చాన్స్ కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అలా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా బలమైన నేతలు ఒకరిద్దరికి చాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఆ కోటా జనసేనదే అని చెబుతున్నారు. ఏపీ నుంచి టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంది. అయితే జనసేనకు మాత్రం అవకాశం దక్కలేదు. నిజానికి గత ఏడాది జూన్ 9న మూడవసారి మోడీ ప్రభుత్వం కొలువు తీరినపుడే జనసేనను అడిగారని కూడా చెప్పుకున్నారు. అయితే నాగబాబుని దృష్టిలో ఉంచుకుని తర్వాత చూద్దామని ఆ పార్టీ అధినాయకత్వం చెప్పిందని ప్రచారం సాగింది.
అలా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఎపుడు జరిగినా జనసేనకు ఒక మంత్రి పదవి రిజర్వు అయిపోయింది అని అంతా చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు రాజ్యసభకు కాకుండా ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే అది ఇప్పటి దాకా జరగలేదు.
దాంతో పాటు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అన్నది ఇపుడు ముందుకు రావడంతో నాగబాబుని కేంద్రంలోనికి తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది. నాగబాబు ఎమ్మెల్సీ పదవిని వదులుకుని రాజ్యసభ ద్వారా ఎన్నికై కేంద్ర కేబినెట్లోకి వెళ్ళేందుకు వీలుంది. అయితే ఏపీలో చూస్తే 2026 జూన్ దాకా రాజ్యసభ ఖాళీలు లేవు.
దాంతో ఏమి చేస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఇక చూస్తే కనుక జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో ఒకరు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి. ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఆయన కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎంపీ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి ఒకసారి జనసేన నుంచి ఒకసారి గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి అయ్యేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది.
దాంతో ఆయన పేరుని జనసేన అధినాయకత్వం ప్రకటిస్తుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అలా కాదు నాగబాబుని జాతీయ స్థాయిలో కీలకం చేయాలి అనుకుంటే ఆయన పేరుని చెబుతారు. మరో ఏడాదికి కానీ ఆయన రాజ్యసభ మెంబర్ కాలేరు. దాంతో ఆగస్టులో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో జనసేనకు చోటు ఉంటే అది తప్పకుండా బాలశౌరికే వెళ్తుంది అని అంటున్నారు.
అయితే ఇక్కడో అవకాశం ఉంది. మరోసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో జనసేన కేంద్ర కేబినెట్ లో చేరుతుందని చెప్పి ఇపుడు బెర్త్ ని కాదనుకోవడం. అలా భవిష్యత్తు అవకాశాల కోసం అట్టేబెట్టుకోవడం. ఎటూ కళ్ళు మూసుకుంటే ఏడాది ఇట్టే తిరిగిపోతుంది. దాంతో ముందు రాజ్యసభ ఎంపీగా నాగబాబు నెగ్గితే మరోసారి జరిగే విస్తరణలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు కేంద్ర మంత్రి కావాలన్న వాదనే జనసేనలో ఎక్కువగా ఉంది అని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి జనసేనకు కేంద్ర మంత్రి పదవి అన్న ప్రచారంలో అసలు వాస్తావాలు ఏమిటో అన్నది.