హమ్మయ్య కేరళ కాపాడింది: కాంగ్రెస్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కేరళలో పాగా వేసింది.;
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కేరళలో పాగా వేసింది. అధికార ఎల్ డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రెంట్)ను పక్కకు నెట్టి ఇక్కడ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ విజయం దక్కించుకుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో యూడీఎఫ్ కూటమి.. ఏకంగా.. 102 స్థానాల్లో ఆధిక్యత కొనసాగించింది. ఇది అప్రతిహత విజయమేనని చెప్పాలి.
ముందు నుంచే..
యూడీఎఫ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ముందు నుంచే కేరళపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ విజయం దక్కించుకోవడం సులువని అంచనాలు వేసుకుంది. అసోంలో బీజేపీ హవాను తట్టుకునే పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మోడీనా -దీదీనా అన్నట్టుగా మారాయి. తమిళనాడులో డీఎంకే సారథ్యం ఉన్న నేపథ్యంలో వస్తే అధికారం లేక పోతే ప్రతిపక్షం అన్నట్టుగా కాంగ్రెస్ ఎక్కువగా కేరళపైనే దృష్టి పెట్టింది.
ఇక, పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆశలు వదిలేసుకుంది. ఈ క్రమానికి తోడు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు కేరళలో ఉండడం కూడా కలిసి వచ్చింది. అదేసమయంలో సీఎం పినరయి విజయన్‌పై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ను క్యాష్ చేసుకోవడంలోనూ కాంగ్రెస్ నాయకత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. రాహుల్ గాంధీ పార్లమెంటుసమావేశాలను కూడా కాదని కేరళకు వచ్చి ప్రచారం చేశారు.
అదేసమయంలో ఎల్ డీఎఫ్ కూటమిలో ఏర్పడ్డ లుకలుకలను కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. వెరసి.. తాజాగా ఫలితాల్లో అప్రతిహత విజయాన్ని అందుకునే దిశగా దూసుకుపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే.. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి ఉండగా.. కూటమికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే విషయంపై ముందుగానే ఒప్పందం జరిగింది. కేరళలో దాదాపు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం గమనార్హం.