ట్రంప్ టారిఫ్ ల వెనుక మర్మమేంటి?

ఈ టారిఫ్‌ల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటిగా ట్రంప్ ‘టార్గెట్ నోబెల్’ ఆశయం స్పష్టంగా కనిపిస్తుంది.;

Update: 2025-08-07 09:51 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50% టారిఫ్‌లు కేవలం ఆర్థిక విధానాల నిర్ణయాలుగా మాత్రమే చూడలేం. ఆ చర్యల వెనుక ఆయన వ్యక్తిగత కోరికలు, అహం, అంతర్జాతీయ రాజకీయ స్వార్థాలు కలగలిపి ఉన్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రంప్ హయాంలో తీసుకున్న ఈ నిర్ణయాలు భారత్-అమెరికా సంబంధాలను ఒక క్లిష్టమైన దశకు తీసుకెళ్ళాయి.

- ట్రంప్ నోబెల్ ఆకాంక్ష, మోదీ నిరాకరణ

ఈ టారిఫ్‌ల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటిగా ట్రంప్ ‘టార్గెట్ నోబెల్’ ఆశయం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు 'ఆపరేషన్ సింధూర్'కి తన కారణంగానే విరామం వచ్చిందని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో "ఇది మూడో దేశం హస్తం లేకుండానే జరిగింది" అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ట్రంప్‌కు తీవ్ర నిరాశ కలిగించిందని, ఆయన అహం దెబ్బతిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ ఇలా ఖచ్చితంగా చెప్పడం ఆయనకు నచ్చలేదని, అది ఆయన కోపానికి ఒక కారణమని భావిస్తున్నారు.

-"అధికారం నాదే" అనే ధోరణి

వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ దక్షిణాసియా నిపుణుడు మైఖేల్ కూగ్లెమన్ చెప్పినట్టు ట్రంప్‌కు మిత్రదేశాలు తలవంచి ఉండడం మాత్రమే ఇష్టం. అయితే భారత్ స్వతంత్రంగా, దృఢంగా వ్యవహరించడం ఆయనకు సులభంగా అనిపించలేదు. ఇదే కోపానికి, కక్షకు దారి తీసిందని ఆయన అభిప్రాయం. భారత్ తన స్వతంత్ర వైఖరిని ప్రదర్శించడమే ట్రంప్ టారిఫ్‌ల వెనుక ఉన్న మరో ముఖ్య కారణం.

-పాకిస్తాన్‌పై ట్రంప్ కుటుంబ ఆసక్తి

ట్రంప్ కుటుంబం పాకిస్తాన్‌తో సంబంధాలను బలపరచడానికి ప్రయత్నించిందనే సమాచారం కూడా ఉంది. క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పాక్ సాయంతో ట్రంప్ కుటుంబం చురుకుగా పాల్గొందట. అంతేకాకుండా, అమెరికా కంపెనీలను చమురు అన్వేషణ కోసం పాకిస్తాన్‌కి వెళ్ళమని ట్రంప్ ప్రోత్సహించడం దీనికి ఉదాహరణ. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ట్రంప్‌ను నోబెల్ బహుమతికి అభ్యర్థిగా ప్రస్తావించింది, ఇది ట్రంప్ ఆశలను మరింత పెంచింది.

- పాకిస్తాన్‌లో చమురు అన్వేషణ విఫలం

అయితే పాకిస్తాన్‌లో చమురు నిల్వలు ఉన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇటలీకి చెందిన ఈఎన్‌ఐ, షెల్, టోటల్ ఎనర్జీస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అక్కడ చమురు అన్వేషణలో విఫలమయ్యాయి. అమెరికా సంస్థ ఎక్సాన్ మొబిల్ కూడా కెక్రా-1లో డ్రిల్లింగ్ చేసి నిరాశతో వెనుతిరిగింది.

- పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన

ఈ పరిణామాల మధ్య పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ మైఖేల్ కురిల్లా రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటానికి పెద్దపీట వేస్తోందని ఇదే కమాండర్ మెచ్చుకోవడం గమనార్హం.

మొత్తానికి ట్రంప్ నిర్ణయాలు కేవలం వాణిజ్య పరమైనవి మాత్రమే కాదని, ఆయన వ్యక్తిగత ఎజెండా, అంతర్జాతీయ రాజకీయాల్లో తన స్థానాన్ని బలపరచుకోవాలనే ప్రయత్నమని స్పష్టమవుతోంది. భారతదేశం తన గౌరవాన్ని, స్వతంత్ర వైఖరిని నిలబెట్టుకుంటూ ఇలాంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Tags:    

Similar News