ట్రంప్ ఎజెండా ఫాలో కాకుంటే పిరికోళ్లా?

ఇదంతా చూసినప్పుడు.. అమెరికా కాకుండా నాటో కూటమి మొత్తం ఏకమై.. ఒకటిగా నిలబడితే అమెరికా పరిస్థితి ఏమిటన్నది ట్రంప్ మర్చిపోతున్నట్లున్నారు.;

Update: 2026-03-21 07:30 GMT

సమాజంలో పేదోడి పరిస్థితి ఏమిటో.. ప్రపంచంలో పేద దేశం పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అదే సమయంలో సంపన్నుడి తీరుకు తగ్గట్లే సంపన్న దేశాల వ్యవహారశైలి అలానే ఉంటుంది. సంపన్న దేశాల కూటమిగా నాటోను చెప్పాలి. ఇందులో మొత్తం 32 సభ్య దేశాలు ఉన్నాయి. అందులోని 29 దేశాలు సంపన్నమైనవి. మరో మూడు మాత్రం ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలుగా చెప్పాలి. అంటే.. నాటోలో పేద దేశమే లేదు. అమెరికా వ్యవస్థాపక సభ్య దేశంగా 1949లో ప్రారంభమైన ఈ కూటమిలో తొలుత కేవలం 12 దేశాలు ఉండేవి.

తర్వాతి కాలంలో సంపన్న దేశాల కూటమిగా చేరి.. అత్యంత బలంగా ఈ కూటమి మారింది. అలాంటి నాటో కూటమిని తాను చెప్పినట్లుగా చేయాలన్న ఒత్తిడిని తెస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అతడి తీరుకు అమెరికా సొంత ప్రజలు మాత్రమే కాదు నాటో దేశాలు సైతం సిద్ధంగా లేవు. తాజాగా ఇరాన్ - ఇజ్రాయల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్దం నేపథ్యంలో తాను చెప్పినట్లు నాటో కూటమి వినాలన్నది ట్రంప్ ఆలోచన. అందుకు నాటో దేశాలు సానుకూలంగా స్పందించకపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు కలిసి రావాలన్న ట్రంప్ పిలుపును ఆ దేశాలు లైట్ తీసుకున్నాయి. తనలాంటి పవర్ ఫుల్ అధినేత నాటో కూటమికి ఆర్డర్ వేసిన తర్వాత వారి నుంచి స్పందన రాకపోవటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తన కసిని తీర్చుకునేలా.. నాటో కూటమిని పిరికివాళ్లుగా ఎద్దేవా చేయటం కనిపిస్తుంది. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు కలిసి రావాలని ట్రంప్ కోరినప్పటికీ.. అందుకు తగ్గట్లు ఏ దేశం స్పందించకపోటంతో ట్రంప్ కు ఎక్కడో కాలింది.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా లేకపోతే నాటో కేవలం ఒక కాగితం మీద పులి లాంటిదన్న ఆయన.. అణ్వాయుధ శక్తిగా మారుతున్న ఇరాన్ ను అడ్డుకునే పోరాటంలో పాల్గొనటానికి, సైనిక చర్యకు ముందుకు రాకపోవటాన్ని తప్పు పడుతూ.. ‘పిరికివాల్లు.. గుర్తు పెట్టుకుంటా’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇదంతా చూసినప్పుడు.. అమెరికా కాకుండా నాటో కూటమి మొత్తం ఏకమై.. ఒకటిగా నిలబడితే అమెరికా పరిస్థితి ఏమిటన్నది ట్రంప్ మర్చిపోతున్నట్లున్నారు.

నిజమే.. ఆర్థికంగా.. ఆయుధపరంగా అమెరికా కంటే కొంత వెనుకబడి ఉన్నప్పటికీ.. నాటోను తక్కువగా అంచనా వేయలేం. ట్రంప్ లాంటి అధినేత తన ఎజెండాకు తగ్గట్లు ప్రపంచ దేశాలన్ని ఫాలో అవ్వాలంటే అసలు ఎందుకు ఫాలో కావాలి? ఒకవేళ.. ఏదైనా ఇష్యూ వస్తే.. అందరిని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి పోరాడాలే కానీ.. ఇలా సందుల్లో గొందుల్లో అమెరికా చెప్పినట్లుగా విరుచుకుపడి తీరాల్సిన అవసరం ఏముంది? అన్నది ప్రశ్న.

ట్రంప్ ఇష్టాయిష్టాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం తమకు ఉందన్న విషయాన్ని నాటోలోని దేశాలు నిర్ణయం తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా తమను అవమానించే ట్రంప్ లాంటోళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే.. తనను తాను ప్రపంచ పోలీసులుగా ఫీలయ్యే ట్రంప్ కు నాటో దేశాలు కాస్తంత షాకులు తరచూ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాటో కూటమిలో ఉన్నది ట్రంప్ ఎజెండాను అమలు చేయటానికి కాదన్న మాటను ప్రపంచం మొత్తం వినేలా చెబితే సరి.


Tags:    

Similar News