ధర్మారెడ్డి అలా చెప్పారా? వైసీపీలో ఇదే చర్చ!
తిరుమల లడ్డూ ప్రసాదం కేసులో సీబీఐ సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో గత మే నెలలో తొలి చార్జిషీటు దాఖలు చేసిన సిట్ అధికారులు ఈ నెలాఖరులో మరో చార్జిషీటు సమర్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.;
తిరుమల లడ్డూ ప్రసాదం కేసులో సీబీఐ సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో గత మే నెలలో తొలి చార్జిషీటు దాఖలు చేసిన సిట్ అధికారులు ఈ నెలాఖరులో మరో చార్జిషీటు సమర్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో కేసు విచారణను వేగవంతం చేశారు. ఇక ఈ కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండు రోజులుగా విచారిస్తున్నారు. సిట్ విచారణలో ధర్మారెడ్డిని ఏ అంశాలపై ప్రశ్నించారో? ఆయన ఏం సమాధానాలు చెప్పారో గానీ, రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియా మాత్రం ధర్మారెడ్డి విచారణపై రకరకాలుగా ప్రచారం చేస్తోంది.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ అదనపు ఈవోగా ఆలయ బాధ్యతలు తీసుకున్న ఏవీ ధర్మారెడ్డి 2020 అక్టోబరులో పూర్తి అదనపు బాధ్యతలతో ఈవోగా అవకాశం దక్కించుకున్నారు. ఈయన ఈవోగా ఉన్నప్పుడే నెయ్యి సరఫరా కాంట్రాక్టును భోలేబాబా డెయిరీకి అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన విచారణ ఎదుర్కొంటుండగా, మంగళవారం తొలిరోజు సుమారు 8 గంటల పాటు సిట్ ప్రశ్నలను ధర్మారెడ్డి ఎదుర్కొన్నారు.
ఇక విచారణలో భాగంగా కల్తీ నెయ్యి వస్తుందని తెలిసి ఎందుకు అడ్డుకోలేకపోయారన్న ప్రశ్నలకు ఆయన హైకమాండ్ ఒత్తిడి ఉందని చెప్పినట్లు ప్రధాన పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ రెండు టీడీపీ అనుకూల మీడియా కావడంతో ధర్మారెడ్డి వాంగ్మూలంపై వైసీపీ నేతలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆయన అలా చెప్పి ఉంటారా? లేక మీడియా కట్టుకథలు అల్లుతోందా? అని అరా తీస్తున్నారు. ఈ విషయమై హాట్ డిబేట్ సాగుతుండగానే బుధవారం టీడీపీ సోషల్ మీడియా మరో ప్రచారం తెరపైకి తెచ్చింది.
కల్తీ నెయ్యి కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారిపోయారంటూ టీడీపీ సోషల్ మీడియా ఉదయం నుంచి హోరెత్తిస్తోంది. ఒకవైపు ధర్మారెడ్డి సిట్ పోలీసులు ఎదుట ఉండగానే, ఈ ప్రచారం ఊపందుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ సోషల్ మీడియా మైండ్ గేమ్ లో భాగంగానే ఈ ఎత్తుగడ ఎంచుకుందా? అని సందేహిస్తున్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ తర్వాత మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. ఈ కారణంతో సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా ‘అప్రూవర్’ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్లు వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.