ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
దేశంలో పాపులర్ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
దేశంలో పాపులర్ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశంలో టెలిగ్రామ్ సేవలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ - 2026 పేపర్ లీక్ వివాదం, రాబోయే నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ముందుగా మేల్కొన్న కేంద్రం
జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ జరగనుంది. ఇప్పటికే నీట్ పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీ ఆరోపణలు, మార్కుల వివాదంతో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్‌ను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని అంటున్నారు. పరీక్షకు ఒకరోజు ముందు, పరీక్ష జరిగిన మరుసటి రోజు వరకు టెలిగ్రామ్‌ను పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఆదేశాలు ఇచ్చింది.
టెలిగ్రామ్ వేదికగా బేరసారాలు?
గత కొన్ని రోజులుగా నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్లు తమ దగ్గర ఉన్నాయంటూ, లీక్డ్ పేపర్లు ఇస్తామంటూ కొందరు అక్రమార్కులు టెలిగ్రామ్ వేదికగా గ్రూపులు, ఛానళ్లు క్రియేట్ చేసి అమాయక విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 'పేపర్ లీక్డ్ నీట్', 'ప్రైవేట్ మాఫియా' వంటి పేర్లతో వందలాది ఛానళ్లు వెలిశాయని అంటున్నారు. పరీక్ష పేపర్ల కోసం వేలాది రూపాయలు వసూలు చేస్తూ పెద్ద ఎత్తున నెట్‌వర్క్ నడుపుతున్నట్లు హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) గుర్తించిందని అంటున్నారు. తాజాగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు రూ. 1.5 కోట్ల మేర మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను కూడా అరెస్ట్ చేశారు.
ఆ 'ఫీచరే పెద్ద శాపం!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం టెలిగ్రామ్‌లో ఉన్న 'మెసేజ్ ఎడిటింగ్' ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత పాత పోస్టులను ఎడిట్ చేసి, అందులో ఒరిజినల్ క్వశ్చన్ పేపర్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల పరీక్ష జరగక ముందే తమకు పేపర్ లీక్ అయినట్లుగా టైమ్‌స్టాంప్ సృష్టించి విద్యార్థులను భ్రమల్లో ముంచుతున్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కేవలం యాప్‌ను బ్యాన్ చేయడమే కాకుండా జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా పూర్తిగా డిసేబుల్ చేయాలని ఆదేశించిందని అంటున్నారు.
ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు
ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. జాతీయ స్థాయి పరీక్షల పవిత్రతను కాపాడటానికి, ఫేక్ పేపర్ లీక్ పుకార్లను అడ్డుకోవడానికి ఈ చర్యలు తప్పనిసరని పేర్కొంది. బీహార్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల పోలీసులు కూడా ఈ ఆన్‌లైన్ మాఫియాపై డేగకన్ను వేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా నీట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీయడం, ఏకంగా ఒక మెసేజింగ్ యాప్‌నే బ్యాన్ చేసే స్థాయికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.