మోడీ సర్.... నిజంగా దౌత్య విజయమేనా?
అయితే.. 2010 నుంచి రాణా అమెరికా జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు అతనిని మోడీ సర్కారు తీసుకువచ్చింది. దీనిని దౌత్య విజయమని.. తాము కాబట్టి రాణాను తీసుకువచ్చామని మోడీ చెబుతున్నారు.;
2008, నవంబరు 26న ముంబైలోని తాజ్ హోటల్ సహా.. పలు ప్రాంతాల్లో సంభవించిన వరుస పేలుళ్ల ఘటన దేశాన్నే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. తీవ్ర ఆందోళన, కలకలం రేపాయి. ఎందుకంటే.. దలాల్ స్ట్రీట్‌కు వ్యాపారం పరంగా అంత పెద్ద పేరుంది. నాటి ఘటనలో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటికీ మించి.. భారత్.. ఉగ్రవాద ముప్పులో చిక్కుకుపోయిందన్న వాదన కూడా వినిపించింది.
ఈ ఘటననే 26/11గా పేర్కొంటారు. ఇప్పుడు ఈ ఘటన.. నాటి సంగతులు మరోసారి తెరమీదికి వచ్చాయి. నాటి ఈ ఘటనకు సంబంధించిన కీలక మాస్టర్ మైండ్‌లలో ఒకడిగా భావిస్తున్న.. తహవ్వూర్ రాణాను భారత ప్రభుత్వం అమెరికా నుంచి తీసుకువచ్చింది. నాడు దారుణ ఘటన జరిగిన తర్వాత.. పాకిస్థాన్ నుంచి అమెరికా పారిపోయిన.. అతనిని అక్కడి అధికారులు అరెస్టు చేసి.. స్థానిక జైల్లో పెట్టారు. అక్కడ కూడా ఉగ్ర ఆరోపణలు, కేసుల నేపథ్యంలోనే జైలుకు వెళ్లాడు.
అయితే.. 2010 నుంచి రాణా అమెరికా జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు అతనిని మోడీ సర్కారు తీసుకువచ్చింది. దీనిని దౌత్య విజయమని.. తాము కాబట్టి రాణాను తీసుకువచ్చామని మోడీ చెబుతున్నారు. అయితే.. జాతీయ మీడియా సహా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. `మోడీ మాత్రమే తీసుకువచ్చారన్న` వాదనను తప్పుబట్టడం లేదు కానీ.. దౌత్య విజయం మాత్రం కాదని పేర్కొనడం గమనార్హం. ``మోడీ హయాంలో రాణాను భారత్‌కు పంపాలన్నది గతంలోనే జరిగింది. కానీ.. ఆగిపోయింది. ఇప్పుడు సాకారం అయింది`` అని `వాషింగ్టన్ డీసీ` పెద్ద అక్షరాలతో రాసుకొచ్చింది.
కానీ, దీనిని దౌత్య విజయంగా మాత్రం ఆ పత్రిక పేర్కొనకపోవడం గమనార్హం. నిజానికి దౌత్య విజయమే అయి ఉంటే.. గత ట్రంప్ తొలి ప్రభుత్వంలోనే రాణా భారత్‌కు రావాల్సి ఉంది. కానీ, రాలేదు. ఇప్పుడు వచ్చాడు.. అనే కన్నా.. పంపించారనే చెబుతున్నాయి. దీనికి కారణం.. ప్రస్తుతం మోడీ సర్కారు ఒక్కటే.. ట్రంప్ విధిస్తున్న భారీ టారిఫ్‌ల విషయంలో యాగీ చేయకుండా.. ఇతర దేశాల మాదిరిగా రెచ్చగొట్టకుండా.. `తటస్థ` విధానాన్ని పాటిస్తోంది. ఇది.. ఈ కీలక సమయంలో ట్రంప్‌కు చాలా అవసరం.
అందుకే.. మోడీ అభిమతమైన.. ముఖ్యంగా భారత్‌లోని రాజకీయాల్లో ఇప్పుడు మోడీ హవా తగ్గుతోందన్న వాదన వినిపిస్తున్న దరిమిలా.. ట్రంప్ చేసిన గొప్ప సాయంగా మాత్రమే.. జాతీయ, అంతర్జాతీయ మీడియాలుపేర్కొనడం గమనార్హం. కాబట్టి.. ఇది దౌత్య విజయం అయితే.. గత పదేళ్లలో ఎందుకు సాధించలేక పోయారన్నది ప్రశ్న. ప్రస్తుతం జరిగింది దౌత్య విజయం అనేకన్నా.. పూర్తి రాజకీయ విజయంగానే చూస్తున్నారు. విజయం ఏదైనా.. భారత్‌ను నాశనం చేయాలన్న ఒక ఉగ్రవాదిని అమెరికా మన దేశానికి అందించడం మాత్రం ఘనమైన విషయంగానే పేర్కొనడం గమనార్హం.