పెళ్లికి ముందు బంధం.. సుప్రీం కీలక తీర్పు
ఈ కేసు లోక్ అదాలత్ విచారణకు రాగా.. అక్కడ వారిద్దరూ రాజీ పడ్డారు. ఇదే సమయంలో ఆదిత్య పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
పెళ్లికి ముందు శారీరక సంబంధం.. గతంలో దీన్నో మహాపాపంగా భావించేవారు. సమాజం కూడా అంగీకరించేది కాదు. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఈ తీరుపై సమాజం చూసే చూపులో మార్పు వచ్చింది. అదే సమయంలో చట్టం.. న్యాయస్థానాలు సైతం ఇలాంటి బంధాల విషయానికి సంబంధించిన వివాదాలు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు కీలక తీర్పులు ఇస్తున్నాయి. తాజాగా అలాంటి తీర్పు ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చింది. పెళ్లికి ముందు బంధం.. పెళ్లి పీటలను ఎక్కాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. అలా పెళ్లికి వెళ్లకపోవటం నైతికతకు సంబంధించిన అంశంగా పరిగణించటం తప్పు కాదని స్పష్టం చేసింది.
ఆసక్తికర అంశం ఏమంటే.. ఈతీర్పు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక పోలీసుకు సంబంధించింది. ఇంతకూ అసలేం జరిగింది? తాజా తీర్పులో సుప్రీం ఏం చెప్పింది? గతంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలా స్పందించింది? ఈ మొత్తం కేసు పూర్వాపరాల్లోకి వెళితే..
ఈ కేసుకు సంబంధించి ప్రస్తావించే పేర్లు మొత్తాన్ని మార్చాం. సదరు వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే క్రమంలో భాగంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇరుగుపొరుగు ఉంటే ఆదిత్య.. అభిలాషల మధ్య ప్రేమ మరో స్థాయికి వెళ్లింది. వారిద్దరూ నాలుగేళ్ల పాటు శారీరక సంబంధాన్ని సాగించారు. అనంతరం ఆదిత్య మరో మహిళను పెళ్లాడాడు. దీంతో.. అభిలాష కేసు పెట్టింది. అతడిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు.
ఈ కేసు లోక్ అదాలత్ విచారణకు రాగా.. అక్కడ వారిద్దరూ రాజీ పడ్డారు. ఇదే సమయంలో ఆదిత్య పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అప్లికేషన్ పెట్టే సమయంలోనే తనపై ఉన్న కేసు వివరాల్ని ఆదిత్య వెల్లడించాడు. ఆ తర్వాత తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు అతడి నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని.. లోక్ అదాలత్ లో దాఖలైన కేసు అతడు తప్పు చేసినట్లుగా ఒప్పుకన్నట్లుగా కాదని.. దాని ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండటం సరికాదని సుప్రీం పేర్కొంది.
ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్న మాట వాస్తవమే అయినా.. ఇద్దరు మేజర్లు పెళ్లికి ముందు బంధం ఉండి.. వారి మధ్య ఉన్న రిలేషన్ పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని పేర్కొంది. ఈ కారణంతో ఒకరిని మరొకరు మోసం చేశారని అనుకునే అస్కారం ఉందన్న సుప్రీం.. పెళ్లి చేసుకోనంత మాత్రాన మోసం చేసినట్లు కాదని పేర్కొంది. అంతేకాదు.. అత్యాచారం జరిగినట్లుకానీ.. ఎవరి బలవంతం వల్లనో.. ఒత్తిడితోనో.. లోక్ అదాలత్ లో రాజీ కుదిరిందన్న ఆధారాలు లేవన్న విషయాన్ని ప్రస్తావించింది.
ఇలాంటప్పుడు రిక్రూట్ మెంట్ బోర్డు కేవలం లోక్ అదాలత్ లో కేసు రాజీ పడ్డారు కాబట్టి..అతను నేరానికి పాల్పడినట్లుగా అంచనా వేయటం తప్పుగా పేర్కొంది. అతడి సెలక్షన్ ను రద్దు చేయటం సరికాదని స్పష్టం చేసిన సుప్రీం.. ఈ కేసును మరింత ముందుకు నడిపేందుకు అభిలాష ఆసక్తి చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లోక్ అదాలత్ వద్ద రాజీ పడిన వైనాన్ని గుర్తు చేసింది.అదే సమయంలో కింది కోర్టు ఆదేశాల్ని కొట్టేస్తూ.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పునరుద్దరిస్తూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం పక్కన పెట్టింది. అతడ్ని తక్షణమే కానిస్టేబుల్ గా పోస్టింగ్ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తాజా ఆదేశాలు పెళ్లికి ముందు బంధాలకు సంబంధించి.. తదనంతరం చోటు చేసుకునే పరిణామాలకు సంబంధించి స్పష్టత వచ్చినట్లుగా చెప్పాలి.