ఒక్క జిల్లా..8 వేల హెచ్ఐవీ కేసులు.. పిల్లలే 400 మంది
20-25 ఏళ్ల కిందటే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఆందోళన పరిచిన అంశం హెచ్ఐవీ వ్యాప్తి. దీంతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంది.;
20-25 ఏళ్ల కిందటే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఆందోళన పరిచిన అంశం హెచ్ఐవీ వ్యాప్తి. దీంతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంది. ఆ వైరస్ వ్యాప్తి కారణాలపై అవగాహన కల్పించంది. ఫలితంగా హెచ్ఐవీ కేసులు కూడా తగ్గాయి. తెలుగు ప్రాంతంలోనే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. అయితే, ఇప్పటికీ సమాజంలో కొన్ని కారణాల రీత్యా పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాల్లో హెచ్ఐవీ కేసులు ఆందోళనకర సంఖ్యలో పెరుగుతున్నాయి. కారణం.. వలస కూలీలు. ఉపాధి రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లే వారు.. అరక్షిత లైంగిక చర్యల కారణంగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. సొంత రాష్ట్రానికి వచ్చిన తర్వాత వారి ద్వారా వైరస్ వ్యాపింపజేస్తున్నారు. తాజాగా బిహార్ లోని ఓ జిల్లాలో వెలుగుచూస్తున్న కేసులను పరిశీలిస్తే అక్కడ ఇలా జరుగుతుందా? అనే భయానుమానం వ్యక్తం కావడం ఖాయం.
8 వేల మంది బాధితులు...
బిహార్ లోని సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ తీవ్రత ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే 8 వేల మంది బాధితులు ఉండడం గమనార్హం. వాస్తవానికి మిగతా దేశంలోలాగే బిహార్ లోనూ హెచ్ఐవీ వ్యాప్తి తగ్గుముఖంలో ఉంది. కానీ, సీతామఢిలోనే అదుపులోకి రానట్లు కనిపిస్తోంది. 7,400-8000 మధ్య నమోదైన కేసుల్లో 18 నుంచి 25 ఏళ్ల లోపు 252 మంది పురుషులు, 135 మంది మహిళలు ఉన్నారని గణాంకాలు చాటుతున్నాయి.
నెలకు 40 నుంచి 60 కేసులు
సీతామఢి జిల్లాలో నెలకు 40 నుంచి 60 కేసులు వెలుగుచూస్తున్నాయి. మరో విషయం ఏమంటే పెద్ద వయసు బాధితుల్లో పురుషులు-మహిళల సంఖ్య సమానంగా ఉంది. వలస కార్మికుల కారణంగానే వైరస్ వ్యాప్తి తీవ్రమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
5 వేలమంది ఉచితంగా మందులు
సీతామఢి జిల్లాలోని ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్ ట్రీట్ మెంట్) సెంటర్లలో నెలకు 5 వేల మంది రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తోంది. ఇక 2022 నుంచి ఈ జిల్లాలో 500 కొత్త కేసులు నమోదవుతుండడం గమనార్హం. 2012 డిసెంబరు నుంచి బిహార్ వ్యాప్తంగా 97 వేల హెచ్ఐవీ కేసులు రికార్డవగా, సీతామఢిలోనే 428 మంది పిల్లలు సహా 6,707 మంది బాధితులుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.