గూగుల్ తో సింహాచలం ఆలయానికి భారీగా ఆదాయం
విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ వద్ద ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ముందే ఆదాయం లభిస్తోంది.;
విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ వద్ద ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ముందే ఆదాయం లభిస్తోంది. విశాఖలో ఉన్న ప్రసిద్ధ ఆలయం సింహాచలానికి ఈ డేటా సెంటర్ వల్ల నేరుగా ఆదాయం దక్కడం విశేషం. సింహాచలం ఆలయానికి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అందులో కొన్ని భూములను డేటా సెంటర్ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. భూములను ఏకంగా కేటాయించకుండా లీజు ప్రతిపాదనలతో దేవస్థానం ముందుకు వెళ్ళడంతో ఆయా భూములకు ఆదాయం దక్కుతోంది.
ఏకంగా 300 కోట్ల దాకా :
గూగుల్ డేటా సెంటర్ కి అవసరం అయిన భూములు 160 ఎకరాలను అందించేందుకు దేవస్థానం అంగీకరించింది. అయితే ఆ భూములకు బదులుగా వేరొక చోట ప్రభుత్వం భూములు ఇస్తామన్న ప్రతిపాదనకు అయితే దేవస్థానం అంగీకరించలేదు. రెవిన్యూ అధికారుల నుంచి ఈ ప్రతిపాదన వచ్చినా సింహాచలం ఆలయ అధికారులు మాత్రం లీజుకే మొగ్గు చూపారు. లీజు ఇవ్వడం ద్వారా ఎప్పటికైనా ఆయా భూములు తమ ఖాతాలో ఉంటాయని ఆలోచనతో పాటు వాటికి ఆదాయం కూడా లభిస్తుందని మరో ఆలోచన ఉంది. దాంతో దీనిని అధికారులు అంగీకరించారు. ఈ క్రమంలో మొత్తం 160 ఎకరాలకు గానూ పదకొండు ఏళ్ళ పాటు లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు అంగీకరించారు. ఈ నేపధ్యంలో ఈ లీజు ద్వారా సింహాచలానికి ఏటా 26 కోట్ల 45 లక్షల రూపాయల ద్వారా ఆదాయం లభించనుంది. పైగా ప్రతీ అయిదేళ్ళకు ఈ లీజు మొత్తాన్ని అయిదు శాతం పెంచుతామన్న లీజు అగ్రిమెంట్ కూడా దాంతో ఉంది. దాంతో మొత్తం 11 ఏళ్ళ లీజు గడువు పూర్తి అయ్యేసరికి అప్పన్న ఆలయానికి ఏకంగా 300 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం లభిస్తుందని అంటున్నరు.
ఈ భూములతో లీజు :
ఇక సింహాచలం దేవస్థానానికి విశాఖ చుట్టు పక్కల మొత్తం భూములు ఉన్నాయి. అందులో మధురవాడ అడవివరం లోనూ భూములు ఉన్నాయి. ఈ భూములల్లో 160 ఎకరాలను లీజు మీద గూగుల్ కి అప్పన్న ఆలయం కేటాయించనుంది. ఇందులో అధిక భాగం అడవివరం నుంచే భూములు కేటాయిస్తున్నారు. ఇక చూస్తే గూగుల్ డేటా సెంటర్ ని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఆనందపురం తర్లువాడ వద్ద ఒకటి అలాగే అడవివరం అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద మరికొంత భూములలో అభివృద్ధి చేస్తారు అని అంటున్నారు. డేటా సెంటర్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 600 ఎకరాలకు పైగా భూములకు సేకరించి అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు ఉన్న చోట ఒకలా రైతుల నుంచి సేకరించిన భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం ఒకలా ఉంటే దేవస్థానం నుంచి లీజు మీద తీసుకున్న భూములకు ఆదాయం ఇవ్వడం ద్వారా ఈ భూసేకరణ పూర్తి చేశారు. ఇక ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ డేటా సెంటర్ కి లాంచనంగా శంకుస్థాపన చేయనున్నారు.