సచిన్ లో బయటకొచ్చిన 'నటుడు'... సమర్ధించిన ఐటీఏటీ!

మైదానంలో బ్యాట్ పట్టుకోవడంలోనే కాదు.. బయట ఆదాయపు పన్ను విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా ఆలోచించడంలోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ దిట్ట అని తాజాగా టాక్స్ బడ్డీ ఫౌండర్.. సుజిత్ బంగర్ వెల్లడించారు.;

Update: 2025-10-31 04:04 GMT

మైదానంలో బ్యాట్ పట్టుకోవడంలోనే కాదు.. బయట ఆదాయపు పన్ను విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా ఆలోచించడంలోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ దిట్ట అని తాజాగా టాక్స్ బడ్డీ ఫౌండర్.. సుజిత్ బంగర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సచిన్ అనుసరించిన వ్యూహాన్ని, దాన్ని ఐటీఏటీ సమర్థించిన తీరును వివరించారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!

అవును... భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. విదేశాల నుంచి ప్రకటనల ద్వారా ఆర్జించిన ఆదాయంపై తెలివైన పన్ను వ్యూహాన్ని అనుసరించారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆయన సుమారు రూ.58 లక్షల మేర పన్ను ఆదా చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

2002-03 నాటిదైన ఈ ఇష్యూలో టాక్స్ ఫైలింగ్‌ లో.. విదేశీ ప్రకటనలు (ఈఎస్‌పీఎన్ స్టార్ స్పోర్ట్స్, పెప్సీ..) ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను మినహాయింపును సచిన్ క్లెయిమ్ చేశారు. ఇందులో భాగంగా... మొత్తం రూ.5.92 కోట్ల ఆదాయంపై సెక్షన్ 80ఆర్.ఆర్ కింద 30 శాతం మినహాయింపు కోసం క్లెయిమ్ చేశారు. ఈ మినహాయింపు విలువ సుమారు రూ. 1.77 కోట్లుగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... సచిన్ టెండుల్కర్ ఈ పన్ను మినహాయింపును పొందేందుకు ప్రధాన కారణం.. తన ఆదాయాన్ని క్రికెటర్‌ గా కాకుండా నటుడిగా పేర్కొనడమే. తన ఆదాయం ఇక్కడ మోడలింగ్ లేదా యాక్టింగ్ వంటి వృత్తుల ద్వారా వచ్చిందని.. ఇది నటుడి వృత్తి కిందికి వస్తుందని.. కాబట్టి సెక్షన్ 80ఆర్.ఆర్ వర్తింపజేయాలని పేర్కొన్నారు.

అడ్డు చెప్పిన ఆదాయపు పన్ను శాఖ!:

అయితే, ఆదాయపు పన్ను శాఖ సచిన్ టెండుల్కర్ ఒక క్రికెటర్ అని.. ప్రకటనలు కూడా దానికి అనుబంధంగానే ఉంటాయని.. అందువల్ల సెక్షన్ 80ఆర్.ఆర్ వర్తించదని వాదించింది. అయితే.. ఇన్‌ కం టాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ).. మోడలింగ్, టీవీ ప్రకటనల వంటి పనుల్లో నైపుణ్యం, ఊహ, సృజనాత్మకత ఉంటాయని.. ఇవి కళాత్మక ప్రదర్శన కిందికి వస్తాయని చెప్పింది.

ఈ సందర్భంగా... ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వృత్తుల్ని కొనసాగించొచ్చని.. అందువల్ల ఇక్కడ ప్రకటనల ఆదాయం నటుడి వృత్తి నుంచి వచ్చిందని ఐటీఏటీ అంగీకరించింది. ఈ ఒక్క తీర్పుతో సచిన్‌ కు భారీగా పన్ను ఆదా అయింది. ఇందులో భాగంగా.. రూ.1.70 కోట్ల ఆదాయంలో 30 శాతం.. సుమారు రూ.58 లక్షల మేర 80ఆర్.ఆర్ మినహాయింపు లభించి, పన్ను ఆదా అయింది.

Tags:    

Similar News