రూపాయి పతనం.. విదేశీ చదువులు ఇప్పుడు ‘డ్రీమ్’ కాదు.. అప్పుల ఊబి.?
హైదరాబాద్‌లో విదేశీ విద్య కలలు కనే విద్యార్థులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఒకప్పుడు యూనివర్సిటీ అడ్మిషన్ వస్తుందా? వీసా రిజెక్ట్ అవుతుందా? అనే భయాలు ఉండేవి.
హైదరాబాద్‌లో విదేశీ విద్య కలలు కనే విద్యార్థులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఒకప్పుడు యూనివర్సిటీ అడ్మిషన్ వస్తుందా? వీసా రిజెక్ట్ అవుతుందా? అనే భయాలు ఉండేవి. కానీ, ఇప్పుడు వాటన్నింటికంటే పెద్ద ప్రశ్నగా మారింది “ఈరోజు డాలర్ రేట్ ఎంత?” అన్నదే భారంగా మారింది.
భారత రూపాయి విలువ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో పడిపోవడం అంతర్జాతీయ విద్యను ఆకాంక్షించే మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేసింది. నిన్నటివరకు సాధ్యమయ్యే ‘కల’గా కనిపించిన విదేశీ చదువు.. నేడు అప్పుల ఊబిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
ఒక్క ఏడాదిలోనే ఊహించని మార్పు
గతేడాది మే నెలలో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు ₹85.50 ఉండగా ప్రస్తుతానికి అది ఏకంగా ₹96.25 మార్కుకు చేరుకుంది. అంటే కేవలం ఒకే ఒక్క ఏడాదిలో రూపాయి విలువ దాదాపు 12 శాతానికి పైగా పడిపోయింది. ఈ ప్రభావం కేవలం అమెరికన్ డాలర్‌పైనే కాదు.. యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్ వంటి అన్ని ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఏటా అమెరికా, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా వెళ్లే వేలాది మంది విద్యార్థులపై లక్షల రూపాయల అదనపు భారం పడుతోంది.
విదేశీ వర్సిటీల్లో సీటు సాధించడం ఒక ఎత్తయితే వీసా ఇంటర్వ్యూల కోసం బ్యాంకుల్లో ఆర్థిక స్థోమత చూపించడం ఇప్పుడు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షగా మారింది. కరెన్సీ విలువ తగ్గడంతో గతేడాది చూపించిన విదేశీ మారక ద్రవ్యానికి ఈ ఏడాది చూపించాల్సిన మొత్తానికి కరెన్సీ కన్వర్షన్‌లోనే లక్షల రూపాయల తేడా వస్తోంది.
ఉదాహరణకు గతేడాది జర్మనీ బ్లాక్డ్ అకౌంట్ కోసం అవసరమైన యూరోల విలువ భారత కరెన్సీలో ఒకలా ఉంటే ఇప్పుడు అదే యూరోలను కొనడానికి అదనంగా ₹1.5 లక్షల నుండి ₹2 లక్షల వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీంతో చాలా కుటుంబాలు ఆస్తులను తాకట్టు పెట్టడమో లేదా అదనపు విద్యా రుణాల వైపు వెళ్లడమో చేస్తున్నాయి.
హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో కొత్త ట్రెండ్
ఇంతకుముందు అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోని గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలలో కేవలం జీఆర్ఈ, ఐఈఎల్.టీఎస్, టోఫెల్, స్కోర్లు, ఎస్ఓపీ గురించే చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. “ఏ రోజున డబ్బు పంపితే రూపాయి రేటు కలిసి వస్తుంది?, ఫారెక్స్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి? అనే విషయాలపైనే తల్లిదండ్రులు, విద్యార్థులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు.
కొంతమంది ముందుచూపున్న తల్లిదండ్రులు డాలర్ రేటు మరింత పెరుగుతుందనే భయంతో ముందే ఫారెక్స్ కార్లను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.
విద్యా కన్సల్టెన్సీల విశ్లేషణ ప్రకారం మారిన ధోరణులు
అమెరికాలో ఫీజులు భారీగా పెరగడంతో విద్యార్థులు ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడిన జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. కరెన్సీ మార్కెట్ కాస్త స్థిరపడుతుందేమోననే ఆశతో కొందరు తమ విదేశీ ప్రయాణాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుంటున్నారు. జీవన వ్యయాలు పెరగడంతో పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా త్వరగా సంపాదించుకునే సదుపాయం ఉన్న దేశాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫీజుల భారం తగ్గించుకోవడానికి యూనివర్సిటీలు ఇచ్చే ఫైనాన్షియల్ ఎయిడ్, స్కాలర్‌షిప్‌ల కోసం పోటీ రెట్టింపు అయింది.
అసలు రూపాయి ఎందుకు పడిపోతోంది?
అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం రూపాయి పతనానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు డిమాండ్ పెరిగి, ఇతర కరెన్సీలు బలహీనపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల భారత్ ఎక్కువ మొత్తంలో డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని సురక్షితమైన డాలర్ల వైపు మళ్లుతున్నారు.
‘స్టడీ అబ్రాడ్’ కలలకు కొత్త లెక్కలు
కేవలం విద్యార్థులే కాదు.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే యువతపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. వీసా అప్లికేషన్ ఫీజుల నుండి విమాన టిక్కెట్ల వరకు ప్రతి ఒక్కటి ప్రియమయ్యాయి. హైదరాబాద్ యువతలో విదేశాల్లో చదువుకోవాలనే కసి, ఆసక్తి తగ్గనప్పటికీ.. మారుతున్న ఆర్థిక పరిస్థితులు మాత్రం వారిని వాస్తవంలోకి నెడుతున్నాయి. ఒకప్పుడు కేవలం అకడమిక్ ప్రణాళికతో సరిపోయే విదేశీ విద్యకు, ఇప్పుడు అంతకంటే బలమైన, పక్కా ఆర్థిక ప్రణాళిక ఉంటేనే ముందడుగు వేయాలి, లేదంటే చదువు పూర్తయ్యేసరికి భారీ అప్పుల భారాన్ని మోయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.