విజయ్ కు అందలం.. సీఎంలు రేవంత్, డీకే, సతీషన్ కు మంగళం.. ఇలా చేస్తే కాంగ్రెస్ ను అనరా మరీ..
| ఢిల్లీలో సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు సీఎం విజయ్, అఖిలేశ్ యాదవ్‌కు మొదటి వరుసలో సీట్లు కేటాయించగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రెండో వరుసలో కూర్చున్నారు. సొంత పార్టీ సీఎంలకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మిత్రపక్షాలకు మర్యాద ఇచ్చేందుకే ఈ ఏర్పాటు జరిగిందని కాంగ్రెస్ మద్దతుదారులు సమర్థిస్తున్నారు.
ఈ మధ్యన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ మాట అన్నారు.. అది బాగా వైరల్ అయ్యింది కూడా.. కాంగ్రెస్ లో ఓ సాధారణ ఎంపీ అయిన ప్రియాంక గాంధీని కారు ఎక్కించే వద్దకు రేవంత్ వెళుతుంటే సెక్యూరిటీ అడ్డుకోవడంపై సెటైర్లు వేశారు. ‘ఆరే.. ఆయన మా ముఖ్యమంత్రి అయ్యా.. 4 కోట్ల ప్రజలకు ప్రతినిధి.. ఒక ఎంపీ ముందర మా సీఎంను అవమానిస్తారా?’ అని కాంగ్రెస్ లోని ఈ సంస్కృతిని చీల్చిచెండాడాడు. అఫ్ కోర్స్ అమిత్ షా వచ్చిన ప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ పరిగెత్తి సెక్యూరిటీ క్లియర్ చేయడంపైనే ఇలానే సైటెర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ సంస్కృతి, పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నాయని.. మనల్ని చీపురుపుల్లాల్లా తీసివేస్తున్నారని మండిపడ్డారు. మన ఆత్మగౌరవం నిలబడాలన్నారు. ఈ మాట విన్నాక సగటు తెలంగాణ వాదులుగా మనకు కాస్త లోపల గుచ్చుకుంది. ఎంత బీఆర్ఎస్ ను విభేదించినా కూడా ఈ పాయింట్ రైట్ అన్న వారు ఎక్కువే.. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి రేవంత్ కు.. పక్కారాష్ట్రం కర్ణాటక సీఎం డీకేకు మరోసారి అవమానించేలా వెనుక వరుసలో కూర్చోబెట్టడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ లోని ఈ సంస్కృతిని నెటిజన్లు చీల్చిచెండాడుతున్నారు.
ఢిల్లీ వేదికగా జరిగిన సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు సాహిత్య లోకంలో కంటే రాజకీయ వర్గాల్లోనే ఎక్కువ చర్చకు దారితీసింది. పుస్తకంలోని విషయాల కంటే ఆ సభలో ఎవరు ఏ వరుసలో కూర్చున్నారన్న అంశమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లకు మొదటి వరుసలో సీట్లు కేటాయించగా.. సొంత పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ తదితరులు రెండో వరుసలో కూర్చోపెట్టడంపై కాంగ్రెస్ అధిష్టానంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.
విమర్శకులు, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేస్తున్నాయి. సొంత పార్టీ తరఫున గెలిచి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలను వెనుక వరుసలో కూర్చోబెట్టి ఇతర పార్టీల అధినేతలకు ముందు వరుసలో అగ్రతాంబూలం ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సొంత ఇంటి నేతల కంటే బయటి మిత్రపక్షాలకే కాంగ్రెస్ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని.. ఇది పార్టీ కోసం కష్టపడుతున్న నేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విమర్శలను కాంగ్రెస్ మద్దతుదారులు.. రాజకీయ విశ్లేషకులు మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న విజయ్, అఖిలేశ్ యాదవ్ వంటి మిత్రపక్షాల నేతలను మొదటి వరుసలో కూర్చోబెట్టడం కేవలం రాజకీయ మర్యాద మాత్రమేనని వారు సమర్థిస్తున్నారు. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సతీష్ లాంటి సీఎంలు కాంగ్రెస్ కుటుంబంలో అంతర్భాగమని.. సొంత ఇంట్లో జరిగే వేడుకకు వచ్చిన అతిథులకు ముందు వరుస ఇవ్వడం సంప్రదాయమని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా స్వయంగా ప్రియాంక గాంధీ కూడా రెండో వరుసలోనే కూర్చున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఎవరినీ తక్కువ చేయడానికి ఉద్దేశించిన ఏర్పాటు కాదని స్పష్టం చేస్తున్నారు.
రాజకీయాల్లో చిన్నపాటి ప్రోటోకాల్ మార్పులు కూడా పెద్ద చర్చలకు దారితీయడం సహజం. మిత్రపక్షాలను దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ సీటింగ్ ఏర్పాటు జరిగిందని కొందరు భావిస్తుంటే.. సొంత నేతల ప్రాధాన్యత విషయంలో పార్టీ పునరాలోచించుకోవాలని మరికొందరు అంటున్నారు. నిర్వాహకుల వైపు నుంచి అధికారిక వివరణ లేనప్పటికీ ఈ 'ఫస్ట్ రో - సెకండ్ రో' వ్యవహారం మాత్రం ఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రాల వరకు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కేంద్రబిందువుగా నిలిచింది.