మోడీతో రేవంత్ ముఖాముఖి భేటి.. అసలు కథేంటి?
ఇంకొక ప్రధాన అంశం "రీజినల్ రింగ్ రోడ్" (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తర , దక్షిణ భాగాలుగా విభజించి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాని మోదీని అభ్యర్థించారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీని రాష్ట్రానికి అవసరమైన కేంద్ర నిధుల మంజూరుకు సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండవ దశకు కేంద్ర సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు.
గత పదేళ్లుగా మెట్రో విస్తరణపై నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర అభివృద్ధి జాతీయ స్థాయిలో వెనుకబడిందని రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 76.40 కిలోమీటర్ల మేర మూడవ దశ మెట్రో విస్తరణను ఐదు కారిడార్లలో చేపట్టాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.
ఇంకొక ప్రధాన అంశం "రీజినల్ రింగ్ రోడ్" (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తర , దక్షిణ భాగాలుగా విభజించి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాని మోదీని అభ్యర్థించారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో దీని ప్రాముఖ్యతను ప్రధానికి వివరంగా వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని, తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశం సాధారణ సమయం కంటే ఎక్కువసేపు సాగింది. అయితే, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ భేటీ ఫలప్రదంగా ముగిసిందని సమాచారం.
ఈ చర్చల అనంతరం ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బయట పాలిటిక్స్ లో కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి తరచుగా ప్రధాని మోదీని నేరుగా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. విమర్శల జడివాన కురిపిస్తుంటారు. అయినప్పటికీ కేంద్రానికి అనుకూలంగా ఉంటూనే తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడడం రేవంత్ ను ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఈ సమావేశం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో కేంద్రం నుంచి అనుకూలత లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా మెట్రో విస్తరణ , రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరగా నిధులు మంజూరైతే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.