కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం : ఎర్రవెల్లి కేంద్రంగా కాకరేపుతున్న రాజకీయం
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ను రాజకీయంగా ఇరుకున పెట్టే లక్ష్యంతో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేసీఆర్ ఫాం హౌసు ఉన్న ఎర్రవెల్లిలో అమరవీరుల కోసం కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదన హీట్ పుట్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు ఇళ్లు నిర్మించాలనే అంశాన్ని బ్రహ్మస్త్రంగా మలుచుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ఫాంహౌసుకు ఎదురుగా ఉన్న భూములను ఎంపిక చేసుకోవడమే రాజకీయంగా చర్చనీయాంశం అవుతోందని అంటున్నారు.
ఇప్పటివరకు ఎర్రవెల్లి అంటే మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే ఇప్పుడు అక్కడ అమరవీరుల కాలనీ నిర్మించి అంతే ప్రాచుర్యం తేవాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. దీనిద్వారా మాజీ సీఎం పక్కనే తాము అమరవీరులకు ఇళ్లు కట్టించి ఇచ్చామని చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి ఎత్తుగడ వేశారని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిని తీసుకురావడం ద్వారా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ఇరుకన పెట్టేశారని అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణమైన తమను బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందనే అసంతృప్తితో ఉన్న ఉద్యమకారుల దృష్టిని ఆకర్షించి రాజకీయంగా పైచేయి సాధించారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరులకు సకల సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే నిర్ణయంతోపాటు అందుకు గడువు కూడా విధించడంతో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ కన్నా తానే ఉద్యమకారులకు బాసటగా నిలుస్తున్నానని చెప్పుకోవడం ద్వారా గులాబీ పార్టీ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టాలని సీఎం వ్యూహారచన చేశారని అంటున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌసులో ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలతో సంచలనం సృష్టించిన రేవంత్, ఆయన ఫాం హౌసుకు ఎదురుగా అమరవీరుల కాలనీ నిర్మించడం ద్వారా తెలంగాణ సమాజాన్ని తనవైపు తిప్పుకునేలా ప్రణాళిక వేశారని అంటున్నారు.
ఈ విధంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న గుర్తింపును హైజాక్ చేసేలా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడ వేశారని అంటున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ తెస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాధ్యమయిందని, బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక రాష్ట్రంలో తమ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే పరిమితమయ్యారని ప్రచారం చేయడానికి ఈ అంశాన్ని వాడుకునేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని అంటున్నారు. ఎర్రవెల్లిలో అమరవీరుల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించడం ద్వారా, తమ త్యాగాలను గుర్తించలేదని ఇన్నాళ్లు బాధపడుతున్న ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసినట్లు అవుతుందని సీఎం నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఒక్క నిర్ణయంతో తెలంగాణ రాజకీయాలను సీఎం రేవంత్ రెడ్డి షేక్ చేశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.