ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా.. బీసీలపై మైలేజీ వచ్చేనా?
ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా.. భారీ ధర్నా కార్యక్రమానికి తెర తీయటం తెలిసిందే.;
మాటలు చెప్పటం వేరు. చేతల్లో చేసి చూపించటం వేరు. బీసీలను విద్య.. ఉద్యోగాలు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణలోని రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా.. 42 శాతం పెంపు కోసం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించటం.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపటం తెలిసిందే. అయితే.. అసెంబ్లీలో తీర్మానం చేసినంత సింఫుల్ గా రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పడదన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీసీల విషయంలో.. వారికి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను జాతీయ స్థాయిలో చూపించుకునేందుకు రేవంత్ సర్కారు నడుం బిగించటం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా.. భారీ ధర్నా కార్యక్రమానికి తెర తీయటం తెలిసిందే. ఈ మహా ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వారు.. ఈ రోజు నిర్వహించే మహా ధర్నాను సూపర్ సక్సెస్ చేయాలన్న కమిట్ మెంట్ తో ఉన్నారు.
ఈ మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ తో పాటు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు పార్టీ అగ్రనాయకత్వం హాజరు కానుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ మహాధర్నాకు ఇండియా కూటమిలోని డీఎంకే.. వామపక్షాలు..శివసేన.. యూబీటీ.. ఎన్సీపీ (ఎస్పీ).. ఆర్జేడీ.. సమాజ్ వాదీ తదితర పార్టీలు హాజరుకానున్నాయి. ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ తనకు తాను బీసీగా చెప్పుకుంటున్నప్పుడు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం.. అదే వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంటే.. దాని అమలుకు అడ్డుకోవటం ఏమిటన్న సందేశాన్ని పంపేందుకు ఈ మహాధర్నా సాయం చేస్తుందని చెప్పాలి.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయస్థాయి నమూనాగా మార్చాలన్న ఏజెండా కాంగ్రెస్ ఉంది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపేందుకు వీలుగా మహాధర్నా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుకు ఆమోదం పలికి.. 9వ షెడ్యూల్ లో చేర్చాలన్న డిమాండ్ కు రాష్ట్రపతి ఆమోదం కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నకాంగ్రెస్.. ఇప్పటికే తాము చెప్పేవి ఉత్త మాటలు కావు.. చేతలన్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. తమ కమిట్ మెంట్ లో ఎలాంటి దురుద్దేశం లేదన్న విషయాన్ని తాజా మహాధర్నాతో మరోసారి ఫ్రూవ్ చేయాలని భావిస్తోంది. మొత్తంగా జాతీయస్థాయిలో బీసీల విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉంది. బీసీల మనసును దోచుకోవటంతో పాటు.. పొలిటికల్ మైలేజ్ లక్ష్యంగా చేస్తున్న మహాధర్నాకు ఎన్డీయే కూటమి ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.