వారిపై మంత్రి రామ్మోహన్ నాయుడికి అంత కోపం ఎందుకంటే..!

ప్రధానంగా... అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్లే కారణం అన్నట్లుగా రకరకాల కథనాలు ప్రసారం చేస్తోంది.;

Update: 2025-07-21 13:30 GMT

ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంతో దేశం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి బాధిత కుటుంబాలు ఇంకా తేరుకోలేకపోతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది.. ఇప్పటికే ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఈ సమయంలో.. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా రకరకాల కథనాలు వండి వార్చేస్తోంది.

ప్రధానంగా... అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్లే కారణం అన్నట్లుగా రకరకాల కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే భారత పైలట్ల సమాఖ్య స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. క్షమాపణలు చెప్పాలంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సాక్షిగా పాశ్చాత్య మీడియాపై మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.

అవును... ఈ రోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇటీవల అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభలో చర్చ జరిగింది. దీనిపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే... ఈ ప్రమాదంపై విదేశీ మీడియాపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు... అహ్మదాబాద్‌ లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని.. దాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. ఈ దర్యాప్తుపై తుది నివేదిక వచ్చాకే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదంపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్విస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) పారదర్శకంగా దర్యాప్తు జరుపుతోంది కానీ, ఈలోపే విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదని.. నిబంధనల ప్రకారమూ, అంతర్జాతీయ ప్రోటోకాల్‌ కు అనుగుణంగానే దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఇదే క్రమంలో... ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలోని బ్లాక్‌ బాక్స్‌ ల నుంచి డేటాను విజయవంతంగా సేకరించామని చెప్పిన కేంద్రమంత్రి... ప్రమాద సమయంలో విమానంలో ఏం జరిగిందన్నది తుది నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుందని అన్నారు. అప్పటివరకు దర్యాప్తు ప్రక్రియను ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరుతున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News