మహిళ యువ నేత ఫొటోలనే మార్ఫింగ్ చేశారు.. ఏం పార్టీ రా మీది?
పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ప్రకంపన రేపుతూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగ మాజీ నేత రాజన్య హల్దార్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి;
పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ప్రకంపన రేపుతూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగ మాజీ నేత రాజన్య హల్దార్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. "నా మార్ఫింగ్ ఫొటోల వెనుక మా పార్టీవాళ్లే ఉన్నారు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. రాజన్య హల్దార్ ఇటీవల తన పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసభ్య ఫొటోలపై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి చెందిన కొంతమంది జూనియర్ లీడర్లు ఏఐ సాయంతో తన డీప్‌ఫేక్ ఫొటోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోల్‌కతా సైబర్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో రాజన్య హల్దార్ "ఇది నా ప్రతిష్టను మట్టికరిపించేందుకు విద్యార్థి విభాగంలోని కొందరు చేసే కుట్ర. నేను నా పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకం చేస్తున్నానని అనేవాళ్లున్నారు. కానీ ఏది నిజమో ఇప్పుడు నిర్ణయించాల్సింది చట్టమే" అంటూ ఘాటుగా స్పందించారు.
- లా కాలేజ్ ఘటనపై వ్యాఖ్యలు.. దెబ్బలు మొదలు అక్కడ్నుంచే!
రాజన్య ఇటీవల ఓ టీవీ షోలో కోల్‌కతా లా కాలేజ్‌లో జరిగిన అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందిలో నెట్టడంతో... అప్పటికే వివాదాల్లో ఉన్న ఆమెపై దాడులు మొదలయ్యాయని, ఇదే సమయంలో మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయని చెబుతున్నారు.
-ప్రధాన నిందితుడిపై పరోక్ష విమర్శ
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాపై పరోక్షంగా విమర్శలు చేసిన రాజన్య.. విద్యార్థి విభాగంలో నేరస్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. ఇదంతా ఆమెపై దాడులకు దారితీసే పరిస్థితులు సృష్టించిందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
-టీఎంసీ స్పందన
రాజన్య ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హద్ హకీమ్ స్పందిస్తూ "ఈ విషయాన్ని ఇప్పటివరకు ఆమె మా దృష్టికి తేలేదు. అయితే ఆమె ఆధారాలతో వచ్చి చెప్పినట్లయితే ఖచ్చితంగా విచారణ జరిపించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.
- వ్యక్తిగత జీవితంలోని విభాగం కూడా రాజకీయంగా?
రాజన్య తన సహచరుడు, ఫిల్మ్ మేకర్ అయిన ప్రాంతీక్ చక్రవర్తిని గత సంవత్సరం వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి రాజకీయ నేపథ్యంపై కూడిన షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో ఓ వివాదాస్పద షార్ట్ ఫిలింలో రాజన్య నటించడంతో టీఎంసీ ఆమెను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆమెపై పరోక్ష, ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయంటూ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాజన్య హల్దార్ వ్యాఖ్యలు ఇప్పుడు టీఎంసీ విద్యార్థి విభాగంలోని అంతర్గత రాజకీయాలను వెలికి తీసినట్లుగా మారాయి. డీప్‌ఫేక్ వంటి సాంకేతిక అస్త్రాలు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఓ ప్రమాదకర ఆయుధంగా మారుతున్నాయనే అంశాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. వాస్తవాలు ఏమిటనేది అయితే త్వరలోనే చట్ట విచారణ ద్వారా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.