రాఘవ లారెన్స్, డిప్యూటీ సీఎం ఫొటో వెనుక అసలు నిజమిదేనా? నెట్టింట హాట్ టాపిక్
ఇన్ స్టాలో raghavalawrenceoffl అనే అకౌంటులో రాఘవ లారెన్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తమిళనాడు అన్న బోర్డుతో ముఖ్యమంత్రి విజయ్ డ్రెస్సింగును పోలినట్లు లారెన్స్ ఫొటోను పోస్టు చేశారు.
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. దళపతి సాధించిన విజయంతో సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖుల పొలిటికల్ ఎంట్రీపై సంకేతాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ద్వారా ఆయన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అంతేకాకుండా రాఘవ లారెన్స్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడానికి కారణమైంది.
'డిప్యూటీ సీఎం' నేమ్‌ప్లేట్‌తో ఏఐ ఫొటో
ఇన్ స్టాలో raghavalawrenceoffl అనే అకౌంటులో రాఘవ లారెన్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తమిళనాడు అన్న బోర్డుతో ముఖ్యమంత్రి విజయ్ డ్రెస్సింగును పోలినట్లు లారెన్స్ ఫొటోను పోస్టు చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఒక ఫొటో అయినప్పటికీ తమిళనాడు ఉపముఖ్యమంత్రి అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్ ఉండటం తీవ్ర ఆసక్తికరంగా మారింది. సీఎం విజయ్ తనకు త్వరలో డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారని లారెన్స్ పరోక్షంగా వెల్లడించినట్లు ఆ పోస్టు ద్వారా తెలుస్తోంది. లారెన్స్ పేరుతోనే ఉన్న ఆ పేజీ నిజంగా ఆయన అధికారిక అకౌంటా? కాదా? అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. కానీ లారెన్స్ ఫొటో, ఉప ముఖ్యమంత్రి అన్న బోర్డు చూసిన నెటిజన్లు ఆ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆలూ లేదు.. చూలు లేదు అప్పుడే ఉప ముఖ్యమంత్రి అంటూ లారెన్స్ ను ట్రోల్ చేస్తున్నారు.
లారెన్స్ ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరలేదు. కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేదు. కానీ నేరుగా 'ఉపముఖ్యమంత్రి' పదవిని ఊహించుకుంటూ ఫొటో పెట్టుకున్నారంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఆయన్ను ఆటాడుకోవడం ప్రారంభించారు. ఇంకా పార్టీలోనే చేరలేదు.. అప్పుడే డిప్యూటీ సీఎం కుర్చీ కావాలా? అని కొందరు, అతి ఆశకు ఒక హద్దుండాలి, కనీసం వార్డు మెంబర్‌గా గెలిచి చూపించండి అని మరికొందరు ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ అభిమానులు సైతం ఈ పోస్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలాంటి ముందస్తు అత్యుత్సాహం వల్ల పార్టీకి నెగెటివిటీ వస్తుందని మండిపడ్డారు.
ట్విస్ట్ ఇచ్చిన అభిమాని
అయితే, ఈ హడావుడి ట్రోలింగ్ అంతా సాగుతున్న తరుణంలోనే ఈ స్టోరీలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లింకును పరిశీలించిన నెటిజన్లు లారెన్స్ మద్దతుదారులు అసలు నిజాన్ని బయటపెట్టారు. ఆ పోస్ట్ షేర్ చేయబడిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ రాఘవ లారెన్స్‌కు చెందిన ఒరిజినల్ ఐడీ కాదని, అది ఒక ఫేక్ అకౌంట్ అని కామెంట్ల రూపంలో స్పష్టం చేశారు. లారెన్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వేరే ఉందని, ఆయనకు ఈ పోస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు. ఎవరో ఆకతాయిలు లేదా లారెన్స్ రాజకీయ ఎదుగుదలను ఇష్టపడని వారు కావాలనే ఆయన పేరుతో ఉన్న ఫేక్ ఐడీని ఉపయోగించి, ఈ ఏఐ ఫొటోను సృష్టించి వివాదానికి తెరలేపారని వ్యాఖ్యానిస్తున్నారు.
సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ
ఇది ఫేక్ అకౌంట్ నుండి వచ్చిన పోస్ట్ అని తేలినప్పటికీ.. సినీ, రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. రాఘవ లారెన్స్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతున్న తరుణంలోనే ఇలాంటి పోస్ట్‌లు రావడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? లేదా కేవలం లారెన్స్‌ను ట్రోల్ చేయడానికి, ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రత్యర్థులు ఆడిన డ్రామానా? అనే కోణంలో విశ్లేషణలు నడుస్తున్నాయి. మొత్తానికి, తిరుచ్చి ఈస్ట్ నుండి లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై వార్తలు వస్తున్న వేళ.. ఈ 'ఫేక్ ఏఐ డిప్యూటీ సీఎం' ఫొటో కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.