వైసీపీ స్వయంకృతం.. అప్పుడే ఎన్నిక నిర్వహిస్తే..
అప్పుడే ఉప ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ ఎన్నిక జరిగేది కాదని, ఓటమిని భరించాల్సిన అవసరం వచ్చేది కాదని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.;
పులివెందులలో పరాజయంతో వైసీసీ తీరని అప్రతిష్ట మూటగట్టుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ పరాజయం వైసీసీ స్వయంకృతం అంటూ విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. తమ సొంత అడ్డాలో ఈ పరిస్థితిని ఊహించని వైసీపీ అగ్ర నాయకత్వం తీవ్ర అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి వైసీపీకి ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేదని, కానీ ఆ పార్టీ అగ్ర నాయకత్వం నిర్లక్ష్యం కారణంగానే సిటింగు స్థానాన్ని కోల్పోవడంతోపాటు అధినేత సొంత మండలంలో పట్టు నిలుపుకోలేకపోయామనే అపప్రదను మోయాల్సి వస్తోందని వైసీపీ కేడర్ వాపోతుంది.
2022లో ఎన్నిక నిర్వహిస్తే..
పులివెందుల జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణంతో తాజాగా ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణించారు. అప్పుడే ఉప ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ ఎన్నిక జరిగేది కాదని, ఓటమిని భరించాల్సిన అవసరం వచ్చేది కాదని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే, జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి 2022లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. జడ్పీటీసీ మరణంతో ఏర్పడిన ఖాళీలో వెంటనే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. కానీ 2022 నుంచి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఏ కారణం చేతనో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహణకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఇప్పుడు ఈ ఓటమిని మూటగట్టుకోవాల్సివచ్చిందని అంటున్నారు.
టీడీపీకి చాన్స్ ఇచ్చింది వైసీపీయే..
వాస్తవానికి 2024లోగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహిస్తే ఇక్కడ టీడీపీకి చాన్స్ దక్కేది కాదు. కానీ, వైసీపీ అధికారంలో ఉండగా, తమ సొంత ఇలాకాలో ఇటువంటి పరిస్థితిని ఊహించలేదని చెబుతున్నారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా, ఏకగ్రీవం అవుతుందని ధీమాతో 2022 నుంచి ఉప ఎన్నిక నిర్వహించలేదు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుందని అంటున్నారు.
పరోక్ష విజయాలపై హేళన
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ పాలకవర్గాలను కైవసం చేసుకుంటూ వచ్చింది. అయితే వైసీపీ తరఫున గెలిచిన వారికి కండువాలు మార్చి టీడీపీ ఆయా స్థానాలను తమ ఖాతాల్లో వేసుకుంటుందని వైసీపీ నేతలు విమర్శిస్తూ టీడీపీ విజయాలకు పెద్దగా ప్రాధాన్యం లేనట్లు తేల్చేసేవారు. అయితే అవన్నీ పరోక్ష ఎన్నికలు కావడంతో ప్రజల్లోనూ పెద్ద చర్చ జరగలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలపై ఫోకస్ చేసిందని అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీతో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
వ్యూహాత్మకంగా టీడీపీ
అందుకే నిండా ఏడాది కూడా లేని జడ్పీటీసీ పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన టీడీపీ, వ్యూహాత్మకంగా పావులు కదిపి వైసీపీని దెబ్బతీసిందని అంటున్నారు. తాజా ఫలితాలపై వైసీపీ ఏ వాదన వినిపించినా, ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అధికార పార్టీ అక్రమాలు చేస్తుందని వాదిస్తున్న వైసీపీ.. ముందుగానే ఎన్నిక జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకోర్టు ద్వారా లేదా ఇతర చట్టబద్ధ మార్గాల ద్వారా ఎన్నికను అడ్డుకుంటే ఈ పరాభవం ఎదురయ్యే పరిస్థితి నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. మొత్తానికి ఈ పరాజయం వైసీపీ స్వయంకృతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.