రండి.. మా ముత్తాత గురించి చర్చిద్దాం: మోడీకి ప్రియాంక అదిరిపోయే కౌంటర్
అయితే.. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు. ఒకరకంగా.. లోక్‌సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు.;
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం లోక్‌సభలో ఆసక్తికర ఘట్టం జరిగింది. జాతీయ గేయం వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. వందేమాతరం గేయాన్ని చిదిమేశారని.. దీనిలో పంక్తులను కుదించి అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరంపై చర్చలో సుమారు 45 నిమిషాల పాటు ప్రధాని మాట్లాడారు. ఇందిరమ్మ సహా.. నెహ్రూ పాలనలపై ఆయన విమర్శలు గుప్పించారు.
అయితే.. సాయంత్రం అదే లోక్‌సభలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలు, వైనాడ్(కేరళ) ఎంపీ ప్రియాంక గాంధీ.. ప్రధాని మోడీ సహా బీజేపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ``ఎప్పుడు ఏ అంశంపై చర్చ జరిగినా.. మా ముత్తాత(నెహ్రూ) ప్రస్తావన లేకుండా ఉండడం లేదు. మాకంటే ఎక్కువగా ఆయనను మీరు(బీజేపీ) కలవరిస్తున్నారు. మంచిదే. కానీ, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని వదిలేసి.. మా ముత్తాత చుట్టూ మీరు తిరుగుతున్నారు. ప్రజలు, వారి సమస్యలు, దేశ భవితవ్యాన్ని కూడా ఫణంగా పెడుతున్నారు. ఇది మీకు వినసొంపుగా ఉంటుంది(నెహ్రూపై విమర్శలు)`` అని వ్యాఖ్యానించారు.
ఇదేసమయంలో ప్రియాంక గాంధీ కీలక సూచన చేశారు. తరచుగా ఏ చర్చ వచ్చినా నెహ్రూ గురించి ప్రసంగించడం ఎందుకని.. వందేమాతరం గేయంపై ఏ విధంగా అయితే చర్చ పెట్టారో.. అలానే తన ముత్తాత(నెహ్రూ)పైనా ఒక రోజు రోజంతా చర్చ పెట్టాలని ఆమె సూచించారు. ``ఆ రోజు పూర్తిగా మీరు నెహ్రూ గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నారో.. అంతా చెప్పేయండి.. ఏం తిట్టా లని అనుకుంటున్నారో అంతా తిట్టేయండి. ఇక్కడితో ఛాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అంతేకానీ.. ప్రతిసారీ చర్చల్లో నెహ్రూ ప్రమేయం ఎందుకు? ప్రజల సమస్యలు లేవా?. వాటిని ప్రస్తావించాల్సిన అవసరం లేదా`` అని ప్రియాంక ప్రశ్నించారు.
అయితే.. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు. ఒకరకంగా.. లోక్‌సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ప్రియాంక గాంధీ ఎక్కడా తడబడకుండా ప్రసంగించడం.. మోడీ చేసిన వ్యాఖ్యలకు ఆమె చురకలు అంటించడం గమనార్హం. దీనిపై లోక్‌సభ స్పీకర్ చిరునవ్వులు చిందించారు. మరోవైపు.. బీజేపీ సభ్యుల ఆందోళనను కాంగ్రెస్ పక్ష సభ్యులు తప్పుబట్టారు. బీజేపీ సభ్యులు అరుస్తుంటే వారించరా? అని ప్రశ్నించారు.