ప్రియాంక బెటర్ అంటున్నారు...ఎందువల్ల ?
రాహుల్ గాంధీ కోటరీ ఎవరో తెలియదు కానీ ఆయన సులువుగా మిత్రులను దగ్గర వారిని దూరం చేసుకుంటారు అని అంటున్నారు. అస్సాం లో ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లోనే ఉండేవారు.
కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. వారసత్వ నాయకులు కూడా పెద్దగా ఆలస్యం లేకుండా నేరుగా ప్రధానమంత్రి కుర్చీలోనే కూర్చోవడం గత మూడు తరాలుగా అంతా చూశారు. నెహ్రూ వెంటనే ఉండి ఆయన ఉండగానే రాజ్యసభకి నెగ్గి నెహ్రూ రాజకీయ కార్యదర్శిగా శ్రీమతి ఇందిరాగాంధీ పనిచేశారు. అలా మెలకువలు అన్నీ నేర్చుకుని తండ్రి మరణం తరువాత కేవలం రెండేళ్ళ వ్యవధిలో ఇందిరాగాంధీ దేశానికి ప్రదహాని అయ్యారు. ఇక ఆమె మరణం తరువాత రాజీవ్ గాంధీ కూడా వెంటనే ప్రధాని అయిపోయారు. కానీ రాజీవ్ మరణించి మూడున్నర దశాబ్దాలు కావస్తున్నా ఆయన వారసులకు ప్రధాని పదవి అందని పండుగా మారుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది కారణాలు ఏమిటి అన్నది కాంగ్రెస్ పార్టీలోనే కాదు బయట మిత్రులలోనూ చర్చ సాగుతోంది.
అవకాశం ఉన్నపుడు అలా :
ఇక 2004లో యూపీలో కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అపుడే అమేధీ నుంచి రాహుల్ గాంధీ కూడా గెలిచి వచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన మంత్రివర్గంలో చేరి అయిదేళ్ల పాటు రాహుల్ పనిచేసి ఉంటే 2009 నాటికి ప్రధాని అయ్యే అవకాశం ఉండేదని కాంగ్రెస్ వర్గాలలోనే అంటూంటారు. కానీ రాహుల్ ఎందుకో మొదట్లో అంతగా ఆసక్తిని కనిపించలేదు. ఇక 2009లో రెండోసారి మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన తరువాత అయినా రాహుల్ మంత్రిగా చేరి చివరి రెండేళ్ళు అయిన ప్రధానిగా చేస్తే కాంగ్రెస్ కి ఈ దుస్థితి వచ్చేది కాదని అంటారు. బాధ్యతలను తీసుకునే విషయంలో రాహుల్ మొదటి నుంచి అనాసక్తిని కనబరచడం వల్లనే కాంగ్రెస్ ఈ రోజున వంద సీట్లకు కూడా దక్కక అధికారం ఎండమావిగా మారిపోతోంది అని అంటున్నారు.
వ్యవహార శైలి మీద :
రాహుల్ గాంధీ కోటరీ ఎవరో తెలియదు కానీ ఆయన సులువుగా మిత్రులను దగ్గర వారిని దూరం చేసుకుంటారు అని అంటున్నారు. అస్సాం లో ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లోనే ఉండేవారు. ఆయన మంత్రిగా కూడా చేశారు. ఆయనను దూరం చేసుకోవడం ద్వారా ఏకంగా ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ ప్రాభవానికి కాంగ్రెస్ కారణం అయింది అని అంటారు. అంతే కాదు మధ్యప్రదేశ్ లో వృద్ధ నాయకులను ప్రోత్సహించి యువ నేత జ్యోతిరాదిత్య సింధియాను దూరం చేసుకోవడం వల్లనే గత రెండు దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ అధికారం అందుకోవడం లేదని అంటున్నారు. గుజరాత్ లో అయితే మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో లేదు, రాజస్థాన్ లో కూడా సచిన్ పైలెట్ ని ముందు పెడితే కాంగ్రెస్ కి మంచి రోజులు వచ్చేవని చెప్పినా రాహుల్ పట్టించుకోలేదని అంటారు.
మిత్రులతోనూ అదే తీరు :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తో పోటా పోటీగా బరిలోకి దిగి బీజేపీకి చాన్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది అని అంటారు. అందుకే కేజ్రీవాల్ దూరం అయిపోయారు. ఇక తమిళనాడులో కూడా డీఎంకే వంటి నమ్మకమైన మిత్రుడిని దూరం పెట్టడం దీర్ఘకాలంలో మంచి వ్యూహం కాదని చెబుతారు. కేరళలో వామపక్షాలతో రాహుల్ వ్యవహరించిన తీరు మీద ఎర్ర పార్టీలు గుర్రుగా ఉన్నాయి. యూపీ బీహార్ లలో యాదవుల నాయకత్వంలోని పార్టీల విషయంలో కాంగ్రెస్ నుంచి రావాల్సిన సహకారం దక్కడం లేదని అంటారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ దూకుడుతో తీసుకునే నిర్ణయాల వల్ల మిత్రులే దూరం అవుతున్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ తీరా ఓటమి చెందగానే పగ్గాలు వదిలేశారు. అది నాయకుడి లక్షణం కాదని అంటారు.
పగ్గాలు అందుకోవాల్సిందే :
ఈ రోజుకీ మల్లిఖార్జున ఖర్గెని పెట్టి రాహుల్ నడిపిస్తున్న ఈ తరహా రాజకీయం వల్ల కాంగ్రెస్ ఎత్తిగిల్లడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పీఠం మీద గాంధీ వంశీకులు ఉంటే వచ్చే ఇమేజ్ వేరు అని అంటున్నారు. కానీ దానికి రాహుల్ గాంధీ సిద్ధంగా లేరు అన్నది తెలుస్తూనే ఉంది. ఈ సమయంలో ప్రియాంకా గాంధీ సరైన నాయకురాలుగా కాంగ్రెస్ లోనూ భావిస్తున్నారు. ఆమెకే పగ్గాలు అప్పగిస్తే కచ్చితంగా కాంగ్రెస్ కి ఎంతో కొంత వైభవం వస్తుందని అంటున్నారు. ఆమె డేరింగ్ అండ్ డేషింగ్ నేచర్ కాంగ్రెస్ కి కలసి వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా లోక్ సభలో ప్రియాంక ప్రసంగాలు కూడా ప్రంశలు పొందుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ విషయంలో మిత్రులతో పాటు సొంత పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్ప చెబుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.