పేర్ని పై నాన్ బెయిలబుల్ కేసు... సీఐని బెదిరించిన కేసులో అరెస్టు ముప్పు

అయితే ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.;

Update: 2025-10-11 07:33 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? అన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం ఆర్.పేట పోలీసుస్టేషన్ లో సీఐ చాంబర్ లోకి అక్రమంగా చొరబడిన పేర్ని నానితోపాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంతోపాటు దురుసు ప్రవర్తనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండటంతో పేర్ని అరెస్టు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ మచిలీపట్నం నగర శాఖ అధ్యక్షుడు మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న ను శుక్రవారం ఆర్.పేట పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మాజీ మంత్రి పేర్ని నాని సీఐ చాంబర్ లోకి వెళ్లి ఆయనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై శుక్రవారం రాత్రి స్పందించిన క్రిష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాజీ మంత్రి పేర్ని నానితోపాటు దీనికి సంబంధించిన ఇతరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

‘‘మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు అనుమతి లేదని వైసీపీ నేతలకు పోలీసులు చెప్పాం. 400 మందికి 41ఏ నోటీసులిచ్చాం. అయితే వైసీపీ నేత సుబ్బన్న పోలీసులకు సహకరించొద్దని వాట్సాప్ సందేశాలు పంపినట్లు మా ద్రుష్టికి వచ్చింది. దీంతోపాటు మరో కేసులో ఏ8 సుబ్బన్నను అదుపులోకి తీసుకుంటే మాజీ మంత్రి పేర్ని నాని పోలీసుస్టేషన్ కు వచ్చి సీఐపై దుందడుకుగా ప్రవర్తించారు. దీన్ని మేం ఖండిస్తున్నాం. ఇలాంటి పద్ధతులను క్షమించేది లేదు. ఏ పార్టీ వారైన చర్యలు తప్పవు.’’ అంటూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.

ఇక ఎస్పీ ఆదేశాలతో పేర్ని నానితోపాటు మరో 29 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం 400 మందిపై కేసు నమోదుచేసినప్పటికీ సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఆర్నేష్ కుమార్ కేసును ద్రుష్టిలో పెట్టుకుని 41ఏ నోటీసులు ఇచ్చినట్లు ఎస్పీ చెప్పారు. నిన్నటి కేసులో ఎవరినీ అరెస్టు చేయకపోయినా, సీఐ ఏసుబాబుతో పేర్ని నాని దురుసుగా ప్రవర్తించారన్న కేసులో మాత్రం అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రేషన బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో పేర్ని నాని ముందస్తు బెయిలుపై ఉన్నారు. ఈ కేసుతో అరెస్టు ముప్పు ఉండటంతో మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. ఈ కేసులో పేర్నిని అరెస్టు చేసే అవకాశం ఉందా? అంటూ చర్చించుకుంటున్నారు. ఏ విధంగానైనా పేర్నిని జైలుకు పంపాలనే ఆలోచనతో ఉన్న కూటమి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునే పరిస్థితులను పేర్ని స్వయంగా కల్పించారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

Tags:    

Similar News