పవన్ చెప్పిన బూర్గుల ఎవరు...ఈ తరానికి తెలుసా ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చరిత్ర చదువుకున్నారు. ఆయనకు సామాజిక రాజకీయ అంశాల పట్ల అవగాహన ఎక్కువ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చరిత్ర చదువుకున్నారు. ఆయనకు సామాజిక రాజకీయ అంశాల పట్ల అవగాహన ఎక్కువ. ఆయన పుస్తకాలు కూడా అధికంగా చదువుతారు. ఆయన వెండి తెర మీద ఒక మాస్ హీరో కావచ్చేమో కానీ ఆయనలో సాహిత్య పిపాసి ఉన్నారు. అలాగే దేశ ప్రాంత చరిత్రను అధ్యయనం చేయాలనుకునే ఒక ఉత్సాహి కూడా ఉన్నారు. అందుకే పవన్ ఏపీ ఫార్మేషన్ ముందు వెనకా అన్ని విషయాల మీద పూర్తి ఆవగాహనతో సాధికారతతో మాట్లాడుతారు. చాలా మంది సమకాలీన రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియని అనేక చారిత్రక విషయాలు అంశాలు అన్నీ అలవోకగా పవన్ చెప్పగలుగుతారు. ఇదిలా ఉంటే పవన్ తన తాజా ప్రెస్ మీట్ లో బూర్గుల రామక్రిష్ణా రావు పేరు ప్రస్తావించారు. తెలంగాణా ఆంధ్రా నేషనల్ హైవే బోర్డర్ దగ్గర ఆయన విగ్రహం పెట్టాలని కూడా ప్రతిపాదించారు. దాంతో చాలా మంది ఈ తరానికి చెందిన వారు అంతా ఎవరీ బూర్గుల అని వాకబు చేస్తున్నారు. గూగుల్ లో సెర్చ్ కూడా చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ బూర్గుల అంటే చాలానే చెప్పుకోవాల్సి ఉంటుంది.
అచ్చమైన తెలంగాణావాసి :
బూర్గుల రామక్రిష్ణారావు 1899 మార్చి 13 న నరసింగరావు రంగనాయకమ్మ దంపతులకు తెలంగాణాలోని కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించాడు. ఆయన సొంత స్వగ్రామం బూర్గుల. అదే ఆయన ఒంటి పేరు కూడా అయింది. కానీ నిజానికి వారి అసలు ఇంటి పేరు చూసే పుల్లంరాజు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన బూర్గుల ఆనాడు కీలకమైన వృత్తిగా న్యాయవాదాన్ని ఎంచుకుని మంచి లాయర్‌గా పనిచేశారు. ఇక ఆయన రాజకీయ ప్రవేశం చూస్తే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకులలో ఒకరు ప్రముఖులుగా బూర్గుల రామక్రిష్ణారావు ఉంటారు.
ఆంధ్ర మహా సభకు సారధ్యం :
అంతే కాదు కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించడం మరో విశేషం. శాసనోల్లంఘన ఉద్యమంలోనూ క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1948లో వల్లభాయి పటేల్ సైనిక చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయినపుడు వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు బూర్గుల రెవెన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా ఉంటూనే వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించడం విశేషం.
హైదరాబాద్ స్టేట్ తొలి సీఎం :
ఇక 1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగిపుడు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు బూర్గుల ఎన్నికయ్యారు. అలా మొదటిసారిగా హైదరాబాద్ స్టేట్ ఏర్పాటు అయితే దానికి తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పూర్తి మెజారిటీ లేకున్నా మంత్రివర్గంలో సంపూర్ణ సహకారం లేకున్నా కూడా పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా బూర్గుల పేరు తెచ్చుకోవడం విశేషం. ఇక 1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి కోస్తా, రాయలసీమలతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయినపుడు కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో బూర్గుల పూర్తిగా ఆంధ్రా తెలంగాణా ఐక్యతకు సహకరించి తన సీఎం పదవిని త్యాగం చేశారు. అనంతరం ఆయన కేరళ రాష్ట్రానికి గవర్నరుగా వెళ్ళారు. 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి తరువాత 1962 వరకూ ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా కూడా ఆయన పనిచేశారు.
ఆ త్యాగం ఎంతో గొప్పది :
ఇక్కడ బూర్గుల ప్రస్తావన ఎందుకు అంటే ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేయడానికే అని చెప్పుకోవాలి. ఆనాడు 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అలాగే హైదరాబాద్ స్టేట్ రెండూ విలీనం అయి ఉమ్మడి ఏపీగా అవతరించడానికి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ నాయకత్వంలో ఎంతో కృషి చేసింది. అయితే సీఎంగా తాను గద్దె దిగిపోవడమే కాకుండా ఉమ్మడిగా అంతా కలసి ఉండేందుకు బూర్గుల తీసుకున్న చొరవ చేసిన త్యాగం ఆనాడు శాసనసభ ద్వారా దానికి సంబంధించిన ప్రక్రియను మొత్తం నడిపించిన తీరుతో బూర్గుల చరిత్రలో నిలిచారు. కానీ హైదరాబాద్ స్టేట్ కి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల గురించి ఎక్కడా పెద్దగా ఎవరూ తలచుకోవడం లేదన్న ఆవేదన అయితే ఉంది. ఇన్నాళ్ళకు పవన్ నోటి వెంట ఆయన పేరు రావడం ఎంతో ముదావహం. మరి పవన్ ప్రతిపాదినట్లుగా ఆయన విగ్రహాన్ని ఏపీ తెలంగాణా నేషనల్ హైవే బోర్డర్ వద్ద పెట్టేందుకు అంతా కలసి కృషి చేస్తారా. చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఒక మరపురాని చారిత్రక గురుతు కాబట్టి.