పవన్ కళ్యాణ్ 'నేషనల్' స్కెచ్.. ఏపీ టూ ఢిల్లీ వయా తెలంగాణ?

తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి చాలా లోతైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Update: 2026-06-13 01:30 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరుగుతోంది. ఆయన వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోందా? అన్న అనుమానాలకు బీజం వేస్తున్నట్లు చెబుతున్నారు. తిరుపతి వేదికగా శుక్రవారం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, కొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగబోయే జనసేన ప్రత్యేక సమావేశాలు గమనిస్తే పవన్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావడం లేదని, ఆయన చూపు జాతీయ రాజకీయాలపై పడిందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

భారతీయత వైపు అడుగులు

తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి చాలా లోతైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. “తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఒక రాష్ట్రం కులాల పరిమితులు దాటాలి.. మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితులు దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఒక్క మాటతో ఆయన ఏపీ, తెలంగాణ రాజకీయాలలోని ప్రధాన సమస్యలను ఎత్తిచూపారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాల ప్రభావం, తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ ప్రభావం ఎక్కువనేది బహిరంగ రహస్యమే. ఈ రెండింటినీ దాటుకుని ‘భారతీయత’ అనే ఒకే తాటిపైకి రావాలని పవన్ పిలుపునివ్వడం వెనుక కేవలం హితబోధ మాత్రమే కాదని, ఒక బలమైన ఎజెండా దాగుందనేది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

పవన్ ఎంట్రీతో మారిన సీన్!

ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తెలంగాణ ఎవరి జాగీరు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద అలజడినే సృష్టించాయి. స్థానిక నేతల నుంచి తీవ్ర విమర్శలు, కౌంటర్లు వచ్చినప్పటికీ.. పవన్ ఎక్కడా తగ్గలేదు. తెలంగాణలో జనసేనకు ఉన్న ఓటు బ్యాంకును, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్‌ను రీ-యాక్టివేట్ చేసేలా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అంటున్నారు. ప్రాంతీయ సెంటిమెంట్‌ను దాటి రావాలని ఆయన తాజాగా తెలంగాణను ఉద్దేశించి అనడం వెనుక.. అక్కడ జనసేన ఉనికిని మరింత బలోపేతం చేయడమే కాకుండా, తన భావజాలాన్ని సరిహద్దులు దాటించడం కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

‘జనసేన’ నేషనల్ ఎజెండా!

తిరుపతి సభలో ‘భారతీయత’ గురించి మాట్లాడిన పవన్.. సరిగ్గా దానికి కంటిన్యూయేషన్‌లా ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో జనసేన పార్టీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ టైమింగే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోకుండా, జనసేన సిద్ధాంతాలను, దేశభక్తి-సనాతన ధర్మ భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పవన్ ఈ వేదికను వాడుకోనున్నారని అంటున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక కీలక శక్తిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీ వేదికగా తన పొలిటికల్ మైలేజ్‌ను మరింత పెంచుకునేందుకు పవన్ రెడీ అవడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఒకవైపు ఏపీలో సమర్థవంతమైన పాలకుడిగా పేరు తెచ్చుకుంటూనే, మరోవైపు తెలంగాణలో ఉనికిని చాటుకుంటూ, ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పవన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News