పరిటాల శ్రీరామ్ ఫస్ట్ విక్టరీ.. శ్రీసత్యసాయి జడ్పీ తొలి చైర్మనుగా అవకాశం
| టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024లో పొత్తుల కారణంగా పోటీకి దూరమైన ఆయనకు ఈ గెలుపు కీలకంగా మారింది. ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి పేరు కూడా చైర్మన్ రేసులో వినిపిస్తోంది.
టీడీపీ యువనేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వారసుడు పరిటాల శ్రీరామ్ కు ఎట్టకేలకు పదవీ యోగం పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన శ్రీసత్యాసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీగా ఘన విజయం సాధించారు. ఈ విజయంతో శ్రీరామ్ పొలిటికల్ ఇన్నింగ్స్‌లో తొలి మైలురాయిని అందుకున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో తమ కుటుంబానికి ఉన్న పట్టును నిరూపించుకున్నారు. మరోవైపు జడ్పీటీసీగా ఎన్నికైన శ్రీరామ్ శ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన భరోసాతోనే ఆయన జడ్పీటీసీగా బరిలోకి దిగారని అంటున్నారు.
కదిరి నియోజకవర్గం పరిధిలోని నల్లచెరువు జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్, తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరామ్ ఓటమి పాలకయ్యారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పొత్తుల కారణంగా ధర్మవరం స్థానం బీజేపీకి కేటాయించడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయనను జడ్పీ పోరులో నిలిపింది.
ఈ స్థానిక పోరులో పరిటాల శ్రీరామ్ సాధించిన భారీ గెలుపు కేవలం జడ్పీటీసీ సభ్యత్వానికే పరిమితం కాలేదు. నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఈ విజయం ఆయనకు నేరుగా మార్గం సుగమం చేసిందని అంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో, టీడీపీ అధిష్ఠానం పక్కా వ్యూహంతోనే శ్రీరామ్‌ను నల్లచెరువు స్థానం నుంచి నిలబెట్టి గెలిపించుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో పరిటాల శ్రీరామ్ ప్రధాన పోటీదారుడిగా ఉండగా, స్థానిక పొత్తులు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇతర నాయకుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన నుంచి పుట్టపర్తి రూరల్ జడ్పీటీసీగా బరిలోకి దిగిన చిలకం మధుసూదన్ రెడ్డి పేరు చైర్మన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్టానం ఆశీస్సులతో పరిటాల శ్రీరామ్ కు జడ్పీ గిరీ ఖాయమన్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో శ్రీరామ్ తల్లి పరిటాల సునీత రాప్తాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఈ కారణంగా కేబినెట్ హోదాను ఉన్న జడ్పీ చైర్మన్ పదవిని పరిటాల కుటుంబానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి భారీ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి గట్టి పోటీ ఇస్తూనే, కంచుకోటలుగా ఉన్న పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన విజయాన్ని సాధించారు. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రాబల్యం మరింత బలపడటమే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ పాలకవర్గంపై టీడీపీ జండా ఎగరడం ఖాయమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.