సైన్యాన్ని అద్దెకు ఇవ్వబడును.. పాకిస్తాన్ దివాళా ఆఫర్

ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.;

Update: 2025-10-25 09:12 GMT

ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ తన సైన్యంలో 25,000 మంది సైనికులను సౌదీ అరేబియాకు పంపించడానికి సిద్ధమవుతోంది. "ఎవరైనా దాడి చేసినా ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలి" అనే నిబంధనతో ఈ ఒప్పందం కుదిరినప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.

* ఆర్థిక కష్టాల భారం & అద్దె సైన్యం వ్యూహం

పాకిస్థాన్ ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్బణం, డాలర్ కొరత, , ఐఎంఎఫ్ రుణాల ఒత్తిడితో కూడిన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు పెంచుకోవడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి పాక్ ప్రభుత్వం కొత్త మార్గాలు వెతుకుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే, సౌదీకి సైన్యాన్ని "అద్దెకు" ఇవ్వడం ఒక వ్యూహాత్మక ఆర్థిక చర్యగా మారింది.

సౌదీ ప్రభుత్వం ఈ ఒప్పందం కింద పాకిస్థాన్‌కు $288 వేల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని అందించనుంది. ఇందులో ఆర్థిక సాయం, ఆయుధ సరఫరా, చమురు రాయితీలు వంటి అంశాలు ఉండనున్నట్లు సమాచారం.

* 'అద్దె సైన్యం' కాన్సెప్ట్ కొత్తది కాదు

నిజానికి పాకిస్థాన్‌కి ఇది పూర్తిగా కొత్త విషయం కాదు. గతంలో కూడా పాక్ సైనికులు సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో శిక్షణా బృందాలుగా, రక్షణ సలహాదారులుగా పనిచేశారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. కేవలం సహకారం కాకుండా ఇది "పూర్తి స్థాయి అద్దె సైన్యం" విధానంగా మారుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ ఇప్పుడు అక్షరాలా "సైన్యం అద్దె వ్యాపారంలో"కి దిగిందన్న విమర్శలు వస్తున్నాయి.

* సౌదీకి ఎందుకు ఈ అవసరం?

సౌదీ అరేబియాకు కూడా సైనిక మద్దతు అత్యవసరమైంది. ఇటీవల కాలంలో యెమెన్‌లో హౌతి తిరుగుబాటుదారుల దాడులు సౌదీ సరిహద్దులకు ముప్పుగా మారాయి. ఇరాన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన, ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ సైన్యం మద్దతు సౌదీకి అనుకూలంగా మారింది.

* పాక్ భవిష్యత్తు ఏమవుతుంది?

ఈ 'అద్దె సైన్యం' విధానం పాక్ ఆర్థిక కష్టాలకు తాత్కాలిక ఉపశమనం కావొచ్చు. కానీ ఇది దీర్ఘకాల పరిష్కారం కాదని, దేశ భద్రత, జాతీయ గౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలోనే భద్రతా ముప్పులు పెరుగుతున్న సమయంలో, 25,000 మంది సైనికులను విదేశాలకు పంపడం సరికాదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఆర్థిక కష్టాల కోసం సైన్యాన్ని అద్దెకివ్వడం జాతీయ గౌరవం తగ్గిపోవడమనే విమర్శలు పాక్‌లోనే బలంగా వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలిక ఊరటనిచ్చినా, దీర్ఘకాలంలో దేశ భద్రతా వ్యవస్థకు, అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రమాదకరమే అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News