భారత్ ను మళ్లీ రెచ్చగొట్టిన పాక్ సీడీఎఫ్.. తొలి ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు!
గతవారం పాక్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పదవీ కాలంతో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అసీమ్ మునీర్ ఆ దేశ మొదటి రక్షణ దళాల అధిపతి (సీడీఎఫ్) గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.;
గతవారం పాక్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పదవీ కాలంతో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అసీమ్ మునీర్ ఆ దేశ మొదటి రక్షణ దళాల అధిపతి (సీడీఎఫ్) గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అంటే.. ఏకకాలంలో సైన్యం, నేవీ, వైమానిక దళం.. మూడింటికీ చీఫ్ గా పనిచేస్తారు. ఇదే సమయంలో... దేశ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను నిర్వహించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ ను పర్యవేక్షిస్తారు.
ఈ సందర్భంగా.. తనను గౌరవించడానికి మూడు రక్షణ దళాలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మైకందుకున్న అసీమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ శాంతియుత దేశమని.. అయితే, ఇస్లామాబాద్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరీక్షించడానికి ఎవరినీ అనుమతించబోమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోసారి భారత్ ను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారు.
అవును... భారత్ పై నోరు పారేసుకోవడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా చేసుకున్న పాక్ కొత్త సీడీఎఫ్ అసీమ్ మునీర్ తాజాగా మరోసారి ఆ పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా... భవిష్యత్తులో ఏదైనా దురాక్రమణ జరిగితే పాక్ ప్రతిస్పందన మరింత వేగంగా, తీవ్రంగా ఉటుందని హెచ్చరించారు. ఆ దేశ మొదటి సీడీఎఫ్ గా నియమితులైనందుకు గౌరవించడానికి జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
నాడు కాళ్లబేరం.. నేడు నోటికి లేదు తాళం!:
26 మంది పౌరులను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రస్థావరాలను లక్ష్యం గా చేసుకుని ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం నాలుగు రోజుల పాటు ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో భారత్ కు పాక్ నుంచి కాల్ వచ్చింది. ఈ సమయంలో సీజ్ ఫైర్ కు అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. కానీ.. దాని తర్వాత ఆ ఘర్షణల్లో తమదే పైచేయి అంటూ మునీర్ పలుమార్లు వ్యాఖ్యానించారు!
పాకిస్థాన్, ప్రజాస్వామ్యం కలిసి సాగవు!:
ఆ దేశ సీడీఎఫ్ గా మునీర్ బాధ్యతలు స్వీకరిస్తోన్న సమయలో.. పాక్ లోని రాజకీయ పరిస్థితులు, గందరగోళంపై భారత్ పరిశీలన చేస్తోందా.. పాక్ లో ప్రజాస్వామ్య సంస్థలు క్షీణిస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పాకిస్థాన్, ప్రజాస్వామ్యం కలిసి సాగవని నొక్కి చెప్పారు.