సరిహద్దుల్లో ఉత్కంఠ.. ఉ** పోస్తున్న పాకిస్తాన్ ?
పాకిస్థాన్ ముందే యుద్ధానికి సన్నద్ధమవుతోందని, సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించిందని స్పష్టం చేస్తున్నాయి.;
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ దాడికి ముందే పాకిస్థాన్‌కు దీని గురించి తెలుసా? ఒకవేళ భారత్ దీనికి ప్రతిస్పందనగా తమ మీద చర్యలు తీసుకుంటే ఎలా ఎదుర్కోవాలనే వ్యూహంతో పాకిస్థాన్ ఉందా? సరిహద్దుల్లోని తాజా పరిస్థితులను గమనిస్తున్న అమెరికా నిఘా వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. పాకిస్థాన్ ముందే యుద్ధానికి సన్నద్ధమవుతోందని, సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించిందని స్పష్టం చేస్తున్నాయి.
అమెరికాలోని పెంటగావ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ తమపై దాడి చేయవచ్చని పాక్ ముందుగానే ఊహించింది. ఒకవేళ అలా జరిగితే వెంటనే స్పందించడానికి, ప్రతిఘటించడానికి పక్కా ప్రణాళికలు రెడీ చేసుకుంది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఎత్తైన ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం గతంలో ఎన్నడూ లేనంత భారీగా మోహరించి ఉండటమే దీనికి నిదర్శనం. సాధారణంగా అక్కడ ఒకటి లేదా ఇద్దరు సైనికులు మాత్రమే ఉంటారని, ఇప్పుడు పెద్ద సంఖ్యలో దళాలు ఉండడం వారి వ్యూహంలో భాగమేనని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను దృష్టిలో ఉంచుకుని అలాంటి చర్యలకు అవకాశం ఉందని పాకిస్తాన్ ముందే అంచనా వేసింది. అందుకే సరిహద్దుల్లో లెటెస్ట్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు శక్తివంతమైన దళాలను మోహరించింది. భారత్ ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్కు పాల్పడినా దీటుగా తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని పెంటగాన్ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, భారీ శతఘ్నులు, స్నైపర్ గన్స్‌తో భారత సైన్యం తమ స్థావరాలపై కాల్పులు జరిపే అవకాశం ఉందని గ్రహించిన పాకిస్థాన్, రాత్రికి రాత్రే కొన్ని ముఖ్యమైన స్థావరాలను ఖాళీ చేసిందని కూడా వారు తెలిపారు.
మొత్తం మీద చూస్తే పాకిస్థాన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పహల్గాం ఉగ్రదాడి నుంచి భారత్ తేరుకుని తమపై చర్యలు తీసుకునేలోపే పాకిస్థాన్ ఈ స్థాయిలో సన్నద్ధం కావడం చూస్తుంటే, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిణామం కాదని భారతీయ రక్షణ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు, భారత సైన్యానికి చెందిన మాజీ అధికారులు పాకిస్థాన్‌పై 24 గంటల్లోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.