పాక్ లో హ్యాక్..సైబర్ ఎటాక్‌లో ప్రభుత్వ సంస్థలు..చేసిందవరంటే?
ఆర్థికంగా అధ్వానం.. భౌగోళికంగా కయ్యాలు.. రాజకీయంగా అస్థిరత... సామాజికంగా నిత్యం అశాంతే..! ఇదీ పాకిస్థాన్ పరిస్థితి..! దీనికితోడు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలోనూ డొల్ల అని స్పష్టమైంది.;
ఆర్థికంగా అధ్వానం.. భౌగోళికంగా కయ్యాలు.. రాజకీయంగా అస్థిరత... సామాజికంగా నిత్యం అశాంతే..! ఇదీ పాకిస్థాన్ పరిస్థితి..! దీనికితోడు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలోనూ డొల్ల అని స్పష్టమైంది. దాయాది దేశం ప్రభుత్వ వ్యవస్థలే ఇప్పుడు డేటా హ్యాకింగ్ ముప్పులో చిక్కుకున్నాయి. అందులోనూ పాక్ కీలక సంస్థల డేటా లీక్ అయినట్లుగా ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఐసీఈ) ప్రకటించింది. పాక్ ప్రభుత్వంలోని బలహీనతలు, నిర్లక్ష్య వైఖరితోనే ఇదంతా జరిగిందని కూడా స్పష్టం అవుతోంది. దీనిని కేవలం ఒక సర్వర్ పైనే జరిగిన ఎటాక్ గా భావించడం లేదు. దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడిగా అభివర్ణిస్తున్నారు. కారణం.. పలు పాక్ ప్రభుత్వ విభాగాల నుంచి భారీగా సమాచారం లీక్ కావడమే.
ఏమేం లీక్ అయ్యాయి??
ఒకటీ అరా అని కాదు..! అది లేదు ఇది కాదు అని కూడా కాదు..! పోలీసు రికార్డులు, రైల్వే వివరాలు, ఆర్థిక సమాచారం, విద్య, విద్యుత్ సహా కీలక ప్రభుత్వ విభాగాలు.. ఇలా అన్నిట్లోనూ సమాచారం హ్యాక్ అయింది. ఇది పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగకరం కానుంది. ఆఖరికి పోలీస్ రికార్డు వెరిఫికేషన్ డేటా, పాస్ పోర్టుల వివరాలు కూడా బట్టబయలు అయ్యాయి.
ఇది వ్యవస్థల నిర్లక్ష్యమే..
పాకిస్థాన్ అంటేనే అనిశ్చితి.. అక్కడి వ్యవస్థలు అస్తవ్యస్తం. దీంతో సైబర్ ఎటాక్ లను తట్టుకోవడం దాని వల్ల కావడం లేదు. తాజాగా జరిగిన భారీ డేటా ఉల్లంఘన.. పాక్ ప్రభుత్వ సంస్థల్లోని డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. పోలీస్ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని కూడా భద్రపరచడంలో పాక్ ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోంది. ఇదంతా చూస్తుంటే, అత్యంత విలువైన డేటాను భద్ర పరచడంలోనూ అక్కడి సంస్థలు కనీసం అప్రమత్తంగా లేవని స్పష్టం అవుతోంది.
దీంతో ఏం జరుగుతుందో?
పాక్ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సైబర్ భద్రతా వ్యవస్థపై కనీసం పట్టించుకునే దిక్కులేదు. ఎప్పటికప్పుడు తగినవిధంగా అప్ డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడంతో హ్యాకర్లకు లక్ష్యంగా మారుతోంది. ఇలా హ్యాకింగ్ జరుగుతూ పోతూ ఉంటే.. పౌరుల గోప్యతకు భద్రత లేనట్లే. వారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలు, గుర్తింపు కార్డుల సమాచారం హ్యాకర్ల చేతులలోకి వెళ్లింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగానూ పాక్ ప్రతిష్ఠ మరింత దిగజారుతుంది.