ఫిబ్రవరి 22.. అక్టోబర్ 7 ఎందుకు కాకూడదు?

ఏప్రిల్ 22న ఉదయం సూర్యుడు ఉదయించాడు.. కశ్మీర్ లోని పహల్గాం లోని బైసరన్ మైదాన ప్రాంతంలోనూ అదేవిధంగా ఉదయించాడు.;

Update: 2025-04-24 04:02 GMT

ఏప్రిల్ 22న ఉదయం సూర్యుడు ఉదయించాడు.. కశ్మీర్ లోని పహల్గాం లోని బైసరన్ మైదాన ప్రాంతంలోనూ అదేవిధంగా ఉదయించాడు. అయితే.. అక్కడున్న సుమారు 500 మంది పర్యాటకులకు మాత్రం సాయంత్రం అందరిలా ముగియలేదు.! ప్రశాంతంగా ఆహ్లాదంగా ముగియాల్సిన రోజు వారి వారి జీవితాల్లో చీకటిని మిగిల్చింది!

అకస్మాత్తుగా గాలిలో తుపాకీ శబ్ధాలు వినిపించాయి.. కళ్లు మూసి తెరిచేలోపు సుమారు ఐదు లేదా ఆరుగురు ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా చంపేశారు. ఈ ముష్కరులంతా పాకిస్థాన్ నుంచి వచ్చి.. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేసి చేసిన దాడిగా చెబుతున్నారు!

2000 మార్చి 20న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ లో పర్యటించినప్పుడు కశ్మీర్ లోని ఛిట్టసింగ్ పురా గ్రామంలోనూ అమాయకపు పౌరులపై ఉగ్రవాదులు ఇలానే దాడి చేశారు. ఆ సందర్భంలో సిక్కు సమాజానికి చెందిన సుమారు 35 మందిని ఊచకోత కోశారు. ఇప్పుడు జేడీ వాన్స్ పర్యటన వంతు!

ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన అధికారిక, వ్యక్తిగత పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని దారుణంగా ఊచకోతకోశారు. ఈ రెండే సారుప్యతలు కాదు.. ఈ సందర్భంగా అక్టోబర్ 7 - 2023న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై జరిపిన దాడి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి!

అవును... 2023 అక్టోబర్ 7న నేడు పహల్గాం లోని పర్యటకులు ఉగ్రదాడికి ముందు ఎంత సందడిగా ఉన్నారో.. ఆ రోజు ఇజ్రాయెల్ లోని ప్రజలు ఓ మ్యూజికల్ ఫెస్ట్ లో అంతే ఆనందంతో ఉన్నారు. ఆ సమయంలో హమాస్ ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించారు.. సుమారు 1,129 మంది అమాయకపు పౌరులను అత్యంత కిరాతకంగా చంపారు.

కట్ చేస్తే... ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోయింది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ పై హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది. గాజాను వణికించేసింది. ఆ పట్టణాన్ని శిథిలాల గుట్టగా మార్చేసింది. ఆ దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాది అనేవాడు ఈ భూ ప్రపంచంపై కనుమరుగయ్యేవరకూ విశ్రమించేది లేదన్నట్లుగా ఐడీఎఫ్ దాడులు చేస్తోంది!

సరిగ్గా 2025 ఫిబ్రవరి 22న భారత్ పై ఉగ్రమూకలు చేసిన దాడి కూడా ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిగా మనం భావించొచ్చు అనే వాదన వినిపిస్తోంది. అయితే... పాకిస్థాన్, పాలస్తీనా కాదని.. పీఓకే, గాజా కాదని పలువురు వాదించొచ్చు కానీ... హమాస్ అయినా లక్షరే తోయిబా అయినా టీ.ఆర్.ఎఫ్. అయినా... వారంతా ఉగ్రవాదులే కదా!?

మరోపక్క... ఈ ఏడాది మార్చి మొదట్లో బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. జాఫర్ రైలు సంఘటనలో పాక్ ఆర్మీ సిబ్బందితో ఉన్న రైలును హైజాక్ చేసింది. సుమారు 200 మందికి పైగా పాక్ సైనికులను హతమార్చింది. ఇది తమ దేశంలోనే కాకుండా.. ప్రపంచ దేశాల ముందు కూడా పాక్ సైన్యం ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసింది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆ చర్చను మసకబార్చడానికో.. లేక, పాక్ అధికారిక సైన్యం, పాక్ అనధికారిక సైన్యం (ఉగ్రవాదులు అని చాలా మంది భావన!) అంత బలహీనంగా లేవని చెప్పాలనో భారత్ పై తాజా దాడి అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అదే నిజమైతే.. పాక్ ను అస్సలు క్షమించకూడదు.

కారణం... ఆ దేశానికి ఏ సమస్య వచ్చినా, వారిలో ఎవరికి కోపం వచ్చినా.. ఆ సరదా భారత్ పై తీర్చుకోవాలనే ఆలోచన ఏమాత్రం క్షమించరానిది.. అలాంటి ఆలోచన వారికి మరోసారి రాకుండా బుద్ది చెప్పాల్సిన బాధ్యత భారత్ పై ఉందనేది నిర్వివాదాశం అనేది బలంగా వినిపిస్తోన్న వాదనగా ఉంది!

వాస్తవానికి 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి కౌంటర్ గా పాక్ లోని బాలాకోట్ పై వైమానిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే... ఈసారి సైనిక చర్యకంటే ముందు భారత్ దౌత్యపరమైన చర్యలు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే చర్యలు చేపట్టింది. ప్రధానంగా సింధూ జాలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది!

మరికొన్ని నిర్ణయాలు తీసుకొంది. అంతవరకూ మంచిదే కానీ... ప్రపంచం ముందు పాక్ ను మరింత ఒంటరిని చేసే సుదీర్ఘ ప్రాణాళికలు రచించడమూ మరింత సముచితమే కానీ.. అంతకంటే ముందు భారత పౌరుల్లో ఆగ్రహం తగ్గించాల్సిన బాధ్యత.. కేంద్రంపై ఉంది! ఇప్పుడు మెజారిటీ భారతీయులు దాదాపు అదే తరహా ప్రతీకారం కోరుకుంటున్నారు!

ఈసారి కొట్టే దెబ్బ ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపాలి. ఈసారి భారత సైన్యం కొట్టే దెబ్బ.. కనీసం పాతికేళ్లు ప్రత్యర్థి కళ్లముందు కదలాడుతూనే ఉండాలి! ఐడీఎఫ్ గాజాను వణికిస్తోన్న తరహాలో కాకపోయినా.. బాలాకోట్ కు మించిన తరహాలో "ఆ" ప్రాంతాన్ని గజగజ లాడించాలి! ఇది ఓ సామాన్య భారతీయుడి కోరిక ఎందుకు కాకూడదు?

Tags:    

Similar News